Gulf Countries : గల్ఫ్ దేశాల్లో ముదురుతున్న యుద్ధ మేఘాలు అక్కడి సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న మిసైళ్ల యుద్ధం దుబాయ్, అబుదాబి వంటి విలాసవంతమైన నగరాలను అతలాకుతలం చేస్తోంది. వ్యాపారాలకు, లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ఇప్పుడు ఇరాన్ మిసైళ్లకు టార్గెట్‌గా మారాయి. అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రద్దీ ప్రాంతాలను తాకడంతో, ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్ తమ సేవలను నిలిపివేసాయి. దీంతో నిత్యం వేలాది మంది పర్యాటకులు, వ్యాపారవేత్తలతో కళకళలాడే ఈ నగరాలు ఇప్పుడు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో విదేశీ సంపన్నులు, స్థానిక బిలియనీర్లు ఎటూ వెళ్లలేక బిక్కుబిక్కుమంటున్నారు.
ప్రైవేట్ జెట్‌ల కోసం కోట్ల రూపాయల ఖర్చు
యుద్ధ భయం ఏ స్థాయికి చేరిందంటే, అక్కడి నుంచి బయటపడటానికి సంపన్నులు తమ ఆస్తులను వెచ్చించేందుకు కూడా వెనకాడటం లేదు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, కేవలం ఒక ప్రైవేట్ జెట్ సీటు కోసం లేదా ప్రత్యేక విమానం కోసం సుమారు ₹3.2 కోట్లు ($385,000) వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ భద్రతా సంస్థల సాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా విలాసాల కోసం ఖర్చు చేసే ఈ ధనవంతులు, ఇప్పుడు కేవలం “ప్రాణ రక్షణ” కోసం తమ జీవితకాల సంపాదనను ధారపోస్తున్నారు. యుద్ధం అనేది పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా భయపెడుతుందని ఈ పరిస్థితులు నిరూపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి బయటపడటానికి సౌదీ అరేబియా మాత్రమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. దుబాయ్, అబుదాబి, ఖతార్‌లలో విమానాశ్రయాలు దెబ్బతినడంతో, సంపన్నులంతా సుమారు 10 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సౌదీ రాజధాని రియాద్‌కు చేరుకుంటున్నారు. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంకా విమాన సర్వీసులు కొనసాగుతుండటమే దీనికి కారణం. 35 కిలోమీటర్ల మేర లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ, వేలాది డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాగైనా రియాద్ చేరుకుని, అక్కడి నుంచి తమ స్వదేశాలకు వెళ్లాలని వారు ఆరాటపడుతున్నారు. గల్ఫ్ దేశాల చరిత్రలో ఇదొక అతిపెద్ద ‘ధనికుల వలస’గా మిగిలిపోయేలా ఉంది.
