Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా ప్రతీకార సుంకాలు విధించాడు. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. పలు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా టారిఫ్‌లపై చైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. ప్రతిగా.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించింది. దీంతో చైనాపై ట్రంప్ సీరియస్ అయ్యాడు. వారి నిర్ణయాన్ని వెనక్కు తోసుకోకపోతే 50శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు. దీంతో అమెరికా వర్సెస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో చైనా దిగుమతులపై విధించిన కొత్త సుంకాలను వెనక్కి తీసుకోవాలని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
చైనా వస్తువులపై 50శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. కొత్త టారిఫ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని స్వయంగా ట్రంప్‌కు మస్క్ విజ్ఞప్తి చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని లక్షలాది మంది ప్రజలు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో టారిఫ్‌లపై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధింపు తరువాత ఎలాన్ మస్క్ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో వైట్‌హౌస్ సీనియర్ అడ్వైజర్ పీటర్ నవారో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ కార్ల కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. అది కార్ల తయారీ కంపెనీ కాదని, కేవలం విడిభాగాలను అమర్చే కంపెనీ అంటూ ఆరోపించాడు. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, టైర్లు వంటి విడిభాగాలను జపాన్, చైనా నుంచి తీసుకొచ్చి కేవలం అసెంబ్లింగ్ చేస్తారని, చౌకగా లభించే విదేశీ విడిభాగాలే మస్క్ కు కావాలని నవారో విమర్శించారు.
నవారో వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నవారో మూర్ఖుడు అంటూ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో తయారయ్యే కార్లలో టెస్లాదే అగ్రభాగం అని మస్క్ అన్నాడు.