Israel Vs Hezbollah : దక్షిణ లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెలీ ఆర్మీ చొచ్చుకు వెళ్లింది. అక్కడ లెబనాన్ ఆర్మీ, హిజ్బుల్లా ఫైటర్లతో ఇజ్రాయెలీ సైనికులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ పోరాటంలో ఎనిమిది మంది ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు. ఈవిషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా దాడిని మొదలుపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ఆర్మీకి జరిగిన మొదటి ప్రాణ నష్టమిది. హిజ్బుల్లా భీకర దాడుల్లో ఇజ్రాయెలీ యుద్ధ ట్యాంకులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెలీ ఆర్మీని(Israel Vs Hezbollah) తమ దేశ బార్డర్ నుంచి వెనక్కి నెట్టేందుకు హిజ్బుల్లా ఫైటర్లు తీవ్రంగా పోరాడుతున్నట్లు సమాచారం. హిజ్బుల్లా వైపు పెద్దసంఖ్యలో ఫైటర్లు ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read :WittyLeaks : ‘విట్టీ లీక్స్’ను విడుదల చేసిన సీఎం రేవంత్
మరోవైపు లెబనాన్‌లోని సెంట్రల్ బీరూట్‌లో ఉన్న బచౌరా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఐదుగురు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఇక్కడి హిజ్బుల్లాకు చెందిన ఆరోగ్య కేంద్రంపైనా ఇజ్రాయెల్ దాడి చేసిందని తెలిసింది. ఈ భవనానికి సమీపంలోనే ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. బీరుట్ నగరంలోని దహియా ఏరియాలోనూ ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 46 మంది చనిపోగా, 85 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటివరకు లెబనాన్‌లో మొత్తం 1,200 మందికి పైగా చనిపోగా, దాదాపు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయినా ఆ సంస్థ మిలిటెంట్ల పోరాట తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. ఆ విధంగా పోరాడుతుండటం వల్లే ఇజ్రాయెలీ ఆర్మీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హిజ్బుల్లా ఫైటర్లకు మద్దతుగా నిలిచేందుకు సిరియా సరిహద్దు మార్గం మీదుగా ఎంతోమంది యెమన్ హౌతీలు కూడా లెబనాన్ దక్షిణ బార్డర్‌కు చేరుకుంటున్నారని తెలిసింది.