Site icon HashtagU Telugu

US Egg Crisis: ట్రంప్ ఇలాకాలో గుడ్ల గోల‌.. కోడిగుడ్డు కోసం అమెరిక‌న్ల‌ పాట్లు

Us Egg Crisis

Us Egg Crisis

US Egg Crisis: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ తో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే.. అమెరిక‌న్లు మాత్రం కోడిగుడ్ల కోసం పాట్లు ప‌డుతున్నారు. అమెరికాలో కోడిగుడ్డు ధ‌ర కొండెక్కింది. గుడ్ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతోపాటు.. పెద్ద‌మొత్తంలో కొర‌త ఏర్ప‌డ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లకు (రూ.536) చేరింది.

Also Read: Vaastu Tips: ఇంటి ప్రధాన ద్వారంలో ఈ 8 తప్పులు చేయ‌కూడ‌ద‌ట‌!

అమెరికాలో గుడ్ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డానికి బ‌ర్డ్ ఫ్లూ నే ప్ర‌ధాన కార‌ణం. బ‌ర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఈ ఏడాది జ‌న‌వ‌రి- ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో దాదాపు మూడు కోట్లకుపైగా గుడ్లు పెట్టే కోళ్ల‌ను చంపేశారు. అంతేకాదు.. బర్డ్‌ ఫ్లూ వచ్చినప్పటి నుంచి మొత్తం 16.80 కోట్ల కోళ్లను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు. వీటిలో అత్యధికం గుడ్లు కోసం పెంచే కోళ్లే ఉన్నాయి. దీంతో అమెరికాలో గుడ్ల కొర‌త ఏర్ప‌డి, ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, రెండుమూడు నెల‌ల్లో ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని, కోడిగుడ్ల స‌ర‌ఫ‌రా పెరుగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం అక్క‌డ బ‌ర్డ్ ఫ్లూ ప్ర‌భావం త‌గ్గింది. దీంతో చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్‌ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు.

Also Read: Fact Check : ‘‘రూ. 21వేలతో 31 రోజుల్లో రూ.31 లక్షలు’’.. ఇవి సుధామూర్తి వ్యాఖ్యలేనా ?

అమెరికాలో గుడ్ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి స్పందించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు.