Tibet Earthquake : భారత్ సరిహద్దుల్లో ఉన్న టిబెట్‌లో భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2.41 గంటలకు టిబెట్‌లో పలుచోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భూకంపం వివరాలను జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. భూకంపం తర్వాత కొన్ని గంటల పాటు భూప్రకంపనల ముప్పు ఉందని హెచ్చరించింది. ఇలాంటి భూకంపాలు భూమి ఉపరితలానికి(Tibet Earthquake) దగ్గరగా ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల అవి లోతైన భూకంపాల కంటే ప్రమాదకరమైనవి. ఇలాంటి బలమైన భూప్రకంపనల వల్ల భవన నిర్మాణాలు కూలిపోయి, భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. కాగా, మే 8న కూడా టిబెట్‌లో భూకంపం సంభవించింది. అప్పట్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది.
Also Read :Laden Vs Nuclear Weapons : లాడెన్‌తో పాక్ అణు శాస్త్రవేత్తకు లింకులు.. అతడి పుత్రరత్నానికి పెద్ద పోస్ట్
తెలుగు రాష్ట్రాలకూ పెరిగిన ముప్పు
గత రెండేళ్ల వ్యవధిలో భారత్‌లోనూ ఎన్నోసార్లు భూకంపాలు సంభవించాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ పలుమార్లు భూకంపాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలు, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో గత రెండేళ్లలో భూప్రకంపనల తీవ్రత ఎక్కువగా కనిపించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రాంతాలకు భూకంపాల ముప్పు ఎక్కువగా ఉందనే విషయం క్లియర్ అవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల విషయానికొస్తే.. ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. సింగరేణి కాలరీస్ వంటివి ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం అతిగా జరుగుతోంది. ఇవన్నీ ప్రతికూలంగా పరిణమించి భూప్రకంపనలకు కారణమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద భూకంపాల ముప్పు పెరగడం అనేది ఆందోళన కలిగించే అంశమే అని నిపుణులు అంటున్నారు. మైనింగ్ యాక్టివిటీని తగ్గించడంతో పాటు భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.