Site icon HashtagU Telugu

Delhi Tremors: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు

Afghanistan Earthquake Delhi Tremors India

Delhi Tremors: ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున రిక్టర్‌ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్లాన్​ నగరానికి తూర్పు  దిశగా 164 కిలోమీటర్ల దూరంలో భూమికి 121 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని  యూరోపియన్-మెడిటరేనియన్​ భూకంప కేంద్రం (ఈఎంఎస్​సీ) వెల్లడించింది. భూకంపం తీవ్రత తొలుత 6.4గా నమోదైందని తెలిపిన ఈఎంఎస్​సీ, ఆ తర్వాత దాన్ని 5.9కి సవరించింది. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :National Herald Case : సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీట్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీకి 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం

ఇవాళ తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వచ్చిన సమయంలోనే భారతదేశ రాజధాని ఢిల్లీ(Delhi Tremors), దాని పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. కొంతమంది ప్రజలు వాటిని ఫీలయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీకి 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ పేర్కొంది. దీనిపై భారతీయ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. “ఢిల్లీలో భూకంపం వచ్చిందట.. ఎవరైనా ఫీలయ్యారా చెప్పండి’’ అంటూ ఒక యూజర్ ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ‘‘ఢిల్లీలో భూకంపం వచ్చినట్లు అనిపించిందా’’ అని అడుగుతూ ఇంకో వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

Also Read :Vijayashanthi : పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయశాంతి..

ఆఫ్ఘనిస్తాన్‌లో ఫాల్ట్ లైన్ వల్లే భూకంపాలు .. ఏమిటిది  ?

ఆఫ్ఘనిస్తాన్‌లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. హిందూకుష్ పర్వత శ్రేణి భౌగోళికంగా చురుకైన ప్రాంతం. భూమి లోపలి పొరల్లోని టెక్టానిక్ ప్లేట్లు అక్కడ యాక్టివ్‌గా కదలాడుతుంటాయి. అందుకే ఏటా ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపాలు వస్తుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ​ అనేది భారత్ ​- యురేషియా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య అనేక ఫాల్ట్​లైన్లలో ఉంది. ఒక ఫాల్ట్​లైన్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ నగరం మీదుగా వెళ్తుంది. ఫాల్ట్​లైన్‌ ఏరియాలో భూమి లోపలి పొరల్లోని టెక్టోనిక్ ప్లేట్లు నేరుగా ఢీకొట్టుకుంటాయి. అవి తరుచుగా పైకి, కిందికి కదలాడుతుంటాయి.  భూకంపాలు సంభవించినప్పుడు.. భూకంప కేంద్రంలోని లోతు ఎక్కువగా ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది. ఒకవేళ  లోతు తక్కువగా ఉంటే, ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫాల్ట్​లైన్‌లో ఉన్నందు వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప కేంద్రాల్లో తక్కువ లోతు ఉంటుంది. ఫలితంగా అక్కడ భూకంపాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం మయన్మార్​, భారత్​ (హిమాచల్​ ప్రదేశ్​), తజకిస్థాన్​లోనూ భూకంపాలు వచ్చాయి.