పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్ర కారాగారం(Malir Jail in Karachi)లో సంచలనం రేపే ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఖైదీలు (Dozens of prisoners) పోలీసులు పై దాడి చేసి జైలు గోడను ధ్వంసం చేసి పారిపోయారు (Escaped ). ఈ ఘటనలో సుమారు 50 నుండి 200 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిపినప్పటికీ, అనేక మంది ఖైదీలు పరారయ్యారని తెలుస్తోంది.
పరారైన ఖైదీలలో 20 మందిని అధికారులు తిరిగి అరెస్టు చేసినట్లు సమాచారం. మిగిలిన ఖైదీల కోసం పోలీసులు, రేంజర్లు, ఇతర భద్రతా బలగాలు కరాచీ పరిసర ప్రాంతాల్లో వేట ప్రారంభించాయి. హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జైలు బయట ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖైదీలు ఎలా ఈ స్థాయిలో వ్యూహాత్మకంగా దాడి చేసి పారిపోయారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై అధికారికంగా పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడలేదు. జైలు భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంత భారీ సంఖ్యలో ఖైదీలు ఒకేసారి పరారయ్యే స్థాయికి భద్రత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదని , ముందస్తు పన్నాగం కావచ్చన్న అనుమానాలు కూడా ఉన్నా, స్పష్టతకు అధికారిక ప్రకటన అవసరంగా మారింది.