Kennedy Assassination: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ముందడుగు వేశారు. మాజీ దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన దాదాపు 80వేల రహస్య డాక్యుమెంట్లను బహిరంగంగా విడుదల చేయాలని ట్రంప్ ఆదేశాలు చేశారు. దీంతో ఆ డాక్యుమెంట్లను అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. వాటిని ఇక అందరూ చూసి.. కెనడీ హత్యతో ముడిపడిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కెనడీ హత్యకు సంబంధించి ఇటీవలే ఎఫ్‌బీఐ దాదాపు 2400 కొత్త రికార్డులను గుర్తించింది. వాటిని కూడా రిలీజ్ చేశారు. ‘‘ట్రంప్ ప్రభుత్వం అంటే పారదర్శకతకు మారుపేరు.. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.. కెనడీ హత్య వివరాలన్నీ బయటపెట్టారు’’ అని ఈసందర్భంగా అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ప్రకటించారు. ఎలాంటి ఎడిట్స్ లేకుండా.. యథాతథంగా కెనడీ హత్య కేసు రహస్య డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
Also Read :Sunita Williams : సునితా విలియమ్స్ సొంతూరు, కెరీర్, వివాహం.. విశేషాలివీ
కెనడీ హత్య ఇలా జరిగింది..
జాన్ ఎఫ్ కెనడీ(Kennedy Assassination) అమెరికాకు 35వ అధ్యక్షుడు. ఆయన 1961లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 43 ఏళ్లకే ఈ పీఠాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా అరుదైన ఘనతను కెనడీ సొంతం చేసుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ 1963 నవంబరు 22న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని డీలే ప్లాజా మీదుగా కారులో ర్యాలీగా వెళ్తుండగా ఆయనపై అత్యంత సమీపం నుంచే కాల్పులు జరిగాయి. టెక్సాస్ స్కూల్ బుక్ డిపాజిటరీ వద్ద నుంచి లీ హార్వే ఓస్వాల్డ్ కాల్పులు జరిపాడు. ఈ హంతకుడికి గతంలో అమెరికా నేవీలో పనిచేసిన నేపథ్యం ఉంది. కాల్పులు జరిగిన వెంటనే టెక్సాస్‌లోని పార్క్ ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్‌కు జాన్ ఎఫ్ కెనడీని తరలించారు. ఆ తర్వాత అరగంటలోనే ఆయన చనిపోయారంటూ ప్రకటన విడుదల చేశారు. అదే కారులో ప్రయాణించిన నాటి టెక్సాస్ గవర్నర్ జాన్ కోనల్లీకి కూడా గాయాలయ్యాయి. అయితే స్వల్ప చికిత్సతో కోనల్లీ రికవర్ అయ్యారు. మరోవైపు ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడిగా.. నాటి వైస్ ప్రెసిడెంట్ లిండన్ బి.జాన్సన్ అదనపు బాధ్యతలు చేపట్టారు.
Also Read :DK Aruna : డీకే అరుణ ఇంట్లో పడిన దొంగ ఎక్కడి వాడు ? నేరచరిత్ర ఏమిటి ?
అన్నీ అనుమానాలే..
జాన్ ఎఫ్ కెనడీపై కాల్పులు జరిపిన 70 నిమిషాల తర్వాత హంతకుడు లీ హార్వే ఓస్వాల్డ్‌ను డల్లాస్ పోలీసులు పట్టుకున్నారు. రెండు రోజుల తర్వాత (1963 నవంబరు 24న) డల్లాస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి హంతకుడు లీ హార్వే ఓస్వాల్డ్‌ను తరలిస్తుండగా, డల్లాస్‌లో నైట్ క్లబ్ నడిపే జాక్ రూబీ అనే వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. నెత్తురోడుతున్న లీ హార్వే ఓస్వాల్డ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు, అక్కడ అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో జాక్ రూబీని కోర్టు దోషిగా తేల్చింది. 1967లో జైలులో ఉండగా జాక్ రూబీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మొత్తం మీద జాన్ ఎఫ్ కెనడీని లీ హార్వే ఓస్వాల్డ్ ఎందుకు హత్య చేశాడు ? అతడికి సుపారీ ఇచ్చింది ఎవరు ? లీ హార్వే ఓస్వాల్డ్‌ను హత్య చేయమని నైట్ క్లబ్ యజమాని జాక్ రూబీకి ఎవరు చెప్పారు ? జైలులో జాక్ రూబీ ఎలా చనిపోయాడు ? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు.