Donald Trump Jr: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ వారసుడు రెడీ అవుతున్నాడు. ఆయన పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్(47) సంచలన ప్రకటన చేశారు. ‘‘అధికార రిపబ్లికన్ పార్టీ నుంచి నాకు పిలుపు వస్తోంది. ఏదో ఒక రోజు నేను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తా’’ అని ఆయన వెల్లడించారు. ‘‘రిపబ్లికన్ పార్టీని మా నాన్న చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన పార్టీని బలోపేతం చేశారు. రిపబ్లికన్ పార్టీ వాళ్లు నాకు కూడా ఆ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నందుకు గర్వంగా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి నాకు ఉండబట్టే ఈ ప్రపోజల్ వస్తోంది. ఇది గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ఏదో ఒక రోజు తప్పకుండా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా’’ అని జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఖతర్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వేదికగా జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Bangladesh Army Coup: భారత్ మిత్రదేశంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్.. సైనిక తిరుగుబాటు తప్పదా ?
డొనాల్డ్ ట్రంపే చెప్పించారా ?
ఈ కామెంట్స్ ద్వారా 2028లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తాననే స్పష్టమైన సంకేతాలను ఆయన జనంలోకి పంపారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్(Donald Trump Jr) వయసు 78 ఏళ్లు. 2028 నాటికి ట్రంప్ వయసు 81 ఏళ్లకు చేరుతుంది. అంత పెద్ద వయసులోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని డొనాల్డ్ ట్రంప్ భావించినా.. అందుకు రిపబ్లికన్ పార్టీ ఒప్పుకునే అవకాశం లేదు. ఈ విషయాన్ని ట్రంప్ ఫ్యామిలీ ముందే గ్రహించింది. అందుకే ఇప్పటి నుంచే జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను అందరి ముందు చూపించే ప్రయత్నం చేస్తోంది. అతడి ఇమేజ్‌ను పెంచేందుకు తెర వెనుక నుంచి ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. తండ్రి డొనాల్డ్ ట్రంప్ నుంచి అనుమతిని తీసుకున్న తర్వాతే.. 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అంశం గురించి జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.
జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ప్లస్, మైనస్‌లు
- ట్రంప్ నుంచి రాజకీయ వారసత్వాన్ని జూనియర్ డొనాల్డ్ ట్రంప్ అందుకున్నారు. ట్రంప్ చరిష్మాతో ఆయన ఈజీగా అమెరికా ప్రజలతో కనెక్ట్ కాగలరు.
- ట్రంప్ వల్ల జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీలో బలమైన నెట్‌వర్క్ ఏర్పడింది. ఎంతోమంది కీలక నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
- అమెరికా ఎన్నికల్లో గెలవాలంటే భారీగా విరాళాలు పొందాలి. ఇందుకోసం అమెరికాలోని అత్యంత సంపన్నుల పరిచయాలు కావాలి. ఇందులోనూ జూనియర్ డొనాల్డ్ ట్రంప్ సిద్ధ హస్తుడు.
- అయితేే డొనాల్డ్ ట్రంప్‌లా జూనియర్ ట్రంప్‌కు మాట్లాడే ట్యాలెంట్ లేదు. ఇది మైనస్ పాయింటుగా మారొచ్చు. ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నుంచి బలమైన నేత బరిలోకి దిగితే తట్టుకోవడం కష్టంగా మారొచ్చు.