Site icon HashtagU Telugu

Donald Trump Gets One Vote: అమెరికా దిగువ సభ స్పీకర్‌ ఎన్నికలో అనూహ్య ఘటన.. ట్రంప్ కి ఒకే ఒక ఓటు

Donald Trump

Trump Imresizer

అమెరికా దిగువ సభ స్పీకర్‌ ఎన్నికలో అనూహ్య ఘటన జరిగింది. స్పీకర్ పదవికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) పేరును రిపబ్లికన్ పార్టీ నేత మాట్‌ గేట్జ్‌ ప్రతిపాదించారు. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించగా.. ట్రంప్‌ పేరుకు అనుకూలంగా ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా నామినేట్‌ చేసిన రిపబ్లికన్‌ నేత మాట్‌ గేట్జ్‌ వేసిందే. అమెరికా పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో గత మూడు రోజులుగా స్పీకర్ ఎన్నిక కోసం ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఏ అభ్యర్థికీ మెజారిటీ రాలేదు.

ఇదిలా ఉండగా గురువారం నాడు సభలోని సభ్యులు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చూసి బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. 430లో ట్రంప్‌కు కేవలం 1 ఓటు మాత్రమే వచ్చిందని తెలియగానే ప్రతినిధుల సభ సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ ఏకైక ఓటు కూడా ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ నాయకుడు మాట్ గేట్జ్ నుండి ట్రంప్‌కు లభించింది. స్పీకర్‌ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో కెవిన్‌ మెకార్థీ పోటీకి దిగారు. 430 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో స్పీకర్‌గా ఎన్నిక కావాలంటే 218 ఓట్లు రావాలి.

Also Read: Temple Trustee: గుడిలో మహిళను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఆలయ ధర్మకర్త.. సంచలనం రేపుతోన్న వీడియో!

వాస్తవానికి సభలో రిపబ్లికన్‌ పార్టీకి స్వల్ప మెజార్టీ ఉండటంతో కెవిన్‌ మెకార్థీ సునాయాసంగానే గెలవాల్సింది. అయితే, సుమారు 20 మంది రిపబ్లికన్లు ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించడంలేదు. దీంతో మూడు రోజులుగా ఓటింగ్‌ మీద ఓటింగ్‌ జరుపుతున్నారు. ఇప్పటివరకు 12 సార్లు ఓటింగ్‌ నిర్వహించినా.. మెకార్థీ గెలవలేకపోయారు. కాగా అమెరికా (US)లో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్‌ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. అంతకుముందు 1923లో రిపబ్లికన్‌ నేత ఫెడెరిక్‌ గిల్లెట్‌ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు.