Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సమావేశంలో ఆయన ఈ వాదనను వినిపించారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఒకవేళ మీరు ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే రెండు దేశాలతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోనని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు దేశాలపై 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరించినట్లు కూడా ఆయన తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ ట్రంప్ మాకు, భారత్‌కు మధ్య యుద్ధాన్ని ఆపి 2.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడారని పాకిస్థాన్ ప్రధాని మా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వద్ద అంగీకరించారు. అప్పట్లో యుద్ధం ముదురుతోంది. విమానాలను కూల్చివేస్తున్నారు. ఆ సమయంలో నేను ఇరు దేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడాను. నాకు ప్రధాని మోదీ చాలా బాగా తెలుసు అందుకే ఆయనకు ఫోన్ చేశాను అని వివరించారు.
ట్రంప్ ఇంకా ఇలా అన్నారు. వినండి, మీరు ఈ విషయాన్ని తేల్చకపోతే నేను మీతో ట్రేడ్ డీల్ చేయను అని మోదీకి చెప్పాను. అకస్మాత్తుగా అంతా సర్దుమణిగింది. మీరు గనుక యుద్ధం చేస్తే రెండు దేశాల మీద 200 శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరించాను. నిజానికి రెండు దేశాలూ పోరాడాలని అనుకున్నాయి. కానీ డబ్బు విషయం వచ్చేసరికి.. తమకు యుద్ధం వద్దని వారు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు.
Also Read: స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం!
#WATCH | At the Board of Peace Event, US President Donald Trump says, "…He (Pakistani PM) said in front of our Chief of Staff that President Trump saved 25 million lives when he stopped the war between us and India…That war was raging. Planes were being shot down. And I got… pic.twitter.com/pm5eT7xjz3
— ANI (@ANI) February 19, 2026
భారత్- ఇతర దేశాల స్పందన
డొనాల్డ్ ట్రంప్ తాను భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానని గతంలోనూ పలుమార్లు చెప్పుకున్నారు. అయితే భారత్ ఎప్పుడూ ఈ వాదనలను తోసిపుచ్చుతూనే ఉంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ఏ మూడవ శక్తి ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనను కొనసాగిస్తున్నారు. అమెరికాతో పాటు చైనా కూడా మే 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో తామే ‘మధ్యవర్తిత్వం’ వహించామని క్లెయిమ్ చేసుకుంది.
ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆ సమయంలోనే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
