Spy Balloon: చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్..

బ్లింకెన్ చైనా (China) పర్యటన క్యాన్సిల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల ఎంతో కఠిన వైఖరి ప్రదర్శించడం తెలిసిందే.

బ్లింకెన్ చైనా పర్యటన క్యాన్సిల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల ఎంతో కఠిన వైఖరి ప్రదర్శించడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన బైడెన్ సర్కారు చైనా విషయంలో మధ్యేమార్గాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో 2018 తర్వాత తొలిసారిగా అమెరికా నుంచి అత్యున్నత స్థాయి నేతలు బీజింగ్ లో పర్యటించే ముందు అనుకోని పరిణామం చోటు చేసుకుంది. చైనా పంపించిన ఓ హాట్ ఎయిర్ బెలూన్ (Spy Balloon) అమెరికా గగనతలంలో చక్కర్లు కొట్టడం రెండు దేశాల మధ్య అగాధాన్ని పెంచింది.

దీన్ని గూఢచర్య బెలూన్ (Spy Balloon) గా అమెరికా భావిస్తోంది. అమెరికా వాయవ్య ప్రాంతంలో ఇది వెళ్లడాన్ని అమెరికా రక్షణ శాఖ గుర్తించింది. సదరు బెలూన్ ను పేల్చివేస్తే కిందనున్న ప్రజలకు ప్రాణ ప్రమాదం ఏర్పడుతుందని భావించి దాన్ని ఏమీ చేయలేదు. కాకపోతే కీలకమైన అణ్వస్త్రాలు ఉంచిన ప్రాంతాలపై ఇది సంచరించడంతో చైనా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అమెరికా అనుమానించింది.

పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింటెన్, అమెరికా ట్రెజరీ మంత్రి జానెట్ యెల్లెన్ బీజింగ్ పర్యటనను రద్దు ( ప్రస్తుతానికి వాయిదా) చేసుకున్నారు. అమెరికా గగనతలంలో స్పై బెలూన్ (Spy Balloon) సంచరించడం అన్నది తమ దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ పేర్కొంది. తన పర్యటనకు ముందు జరిగిన ఈ ఘటన బాధ్యతారహితమైనదిగా ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.

దీనిపై చైనా విచారం వ్యక్తం చేసింది. పౌర వాతావరణం, ఇతర శాస్త్రీయ అవసరాల కోసం ప్రయోగించగా, అది దారి తప్పి వచ్చినట్టు వివరణ ఇచ్చుకుంది. చైనా బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ చట్టాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆ దేశ విదేశాంగ వ్యవహారాల డైరెక్టర్ యాంగ్ ఈ బ్లింకెన్ కు స్పష్టం చేశారు.

Also Read:  Twitter Blue Tick: బ్లూ టిక్ సబ్ స్క్రైబర్లకు ఆదాయం.. ట్విట్టర్ నిర్ణయం.