యూరప్‌లోని ప్రముఖ విమానాశ్రయాల(Airports )పై సైబర్ నేరగాళ్ల దాడి (Cyber Attack) ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ వంటి కీలక ఎయిర్‌పోర్టుల చెకింగ్ వ్యవస్థలను హ్యాక్ చేయడం వల్ల అక్కడి నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమాన సర్వీసులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. సాధారణంగా ఒక ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ, చెక్‌ఇన్ వ్యవస్థల్లో చిన్నపాటి సాంకేతిక లోపం వచ్చినా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఈసారి నేరుగా సైబర్ దాడి జరగడం వల్ల ప్రయాణికుల డేటా సెక్యూరిటీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు, తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Minister Savitha: బీసీ యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి సవిత
ఈ ఘటన అత్యంత ప్రభావం చూపిన వర్గం అమెరికాకు వెళ్లాల్సిన H1B వీసాదారులు. ముందుగా షెడ్యూల్ ప్రకారం రేపటిలోగా అమెరికాలో హాజరు కావాల్సిన ఉద్యోగులు, విద్యార్థులు ఈ పరిస్థితితో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు వీసా నిబంధనల ప్రకారం ఆలస్యం జరిగితే సమస్యలు తలెత్తే అవకాశముండగా, మరోవైపు ఫ్లైట్ రద్దులు, రీషెడ్యూలింగ్ కారణంగా అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి ఐటీ రంగానికి చెందిన అనేక మంది ఈ పరిస్థితి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్ మిస్ అయినా, సమయానికి చేరుకోలేకపోయినా వారి వృత్తి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక భారత్ సహా అనేక దేశాలకు బయలుదేరాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. దీంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు, స్వదేశానికి రావాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దేశ ప్రభుత్వాలు సాంకేతిక నిపుణుల సహకారంతో దాడికి కారణమైన లోపాలను గుర్తించి, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. అంతర్జాతీయ స్థాయిలో సైబర్ భద్రతపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విమానయాన రంగం వంటి సున్నితమైన విభాగాల్లో సైబర్ ముప్పులను అరికట్టే దిశగా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
