President Attacked : కొమొరోస్ దేశాధ్యక్షుడు అజాలీ అస్సౌమానీపై దాడి జరిగింది. 24 ఏళ్ల అహ్మద్ అబ్దౌ అనే యువకుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దేశాధ్యక్షుడిపై దాడి చేసిన యువకుడు జైలులో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. ఓ మతపెద్దకు సంబంధించిన అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా దేశాధ్యక్షుడు అజాలీ అస్సౌమానీపైకి(President Attacked) సదరు యువకుడు ఒక్కసారిగా దూసుకొచ్చాడు. వంట పనుల్లో వినియోగించే కత్తితో దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తిపైనా అతడు ఎటాక్ చేశాడు. ఈ దాడిలో దేశాధ్యక్షుడు అజాలీ అస్సౌమానీ చేతికి, తలకు గాయాలయ్యాయి. అనంతరం అక్కడున్న వారు దాడి చేసిన వ్యక్తిని (అహ్మద్ అబ్దౌ) పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జైలులో ఉండగా అనుమానాస్పద స్థితిలో అహ్మద్ అబ్దౌ చనిపోవడంపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదెలా జరిగింది అనే ప్రశ్నను అందరూ లేవనెత్తుతున్నారు.
Also Read :Kids Height Increase : మీ పిల్లల ఎత్తును పెంచడానికి కొన్ని సహజ మార్గాలు ..!
జైలులో నిందితుడిని (అహ్మద్ అబ్దౌ) ఇంటరాగేట్ చేయలేదని పోలీసులు అంటున్నారు. అంతకంటే ముందే అతడు ఎలా చనిపోయాడనేది పెద్ద మిస్టరీగా మిగిలింది. ఒకవేళ ఇంటరాగేట్ చేసి ఉంటే దేశాధ్యక్షుడిపై దాడికి అతడిని పురికొల్పింది ఎవరు అనే విషయం బయటపడి ఉండేది. నిందితుడి డెడ్ బాడీని అతడి కుటుంబానికి పోలీసులు అప్పగించారు. మరోవైపు ఈ దాడిలో గాయపడిన దేశాధ్యక్షుడు అజాలీ అస్సౌమానీ కోలుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశాయి. కాగా, అజాలీ అస్సౌమానీ తొలిసారిగా సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారంలోకి వచ్చారు. దేశ అధ్యక్షుడిగా అయ్యారు. ఈక్రమంలో తయారైన రాజకీయ ప్రత్యర్థులే ఈ హత్యాయత్నాన్ని చేయించి ఉంటారని పరిశీలకులు అనుమానిస్తున్నారు. 2002, 2016, 2019, 2024 నుంచి ఇప్పటివరకు ఆయనే దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. సుదీర్ఘ కాలం నుంచి అధికారంలో ఉండటంతో అజాలీ అస్సౌమానీ పాలనా శైలిని నియంతను తలపిస్తుందని చెబుతుంటారు.