Hezbollah Head : లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ భాగంలోని శివారు ప్రాంతాలపై శుక్రవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేస్తోంది. హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ 64 ఏళ్ల హసన్ నస్రల్లా అక్కడ ఉన్నారనే సమాచారం అందినందు వల్లే ఇజ్రాయెల్ (Hezbollah Head) ఈ దాడులు చేసిందని సమాచారం. ఈ దాడుల తర్వాతి నుంచి హసన్ నస్రల్లాతో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ నాయకులకు కమ్యూనికేషన్ కట్ అయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయనకు ఏమైనా జరిగిందా ? అనే ఆందోళనలు పెరిగాయి. ఈ తరుణంలో హిజ్బుల్లా వర్గాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ సంప్రదించింది. హసన్ నస్రల్లా సేఫ్‌గా ఉన్నారని హిజ్బుల్లా నేతలు రాయిటర్స్‌కు తెలిపారు. హసన్ నస్రల్లా యోగ క్షేమాలపై తాము ఆరా తీస్తున్నామని ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read :Hydraa : బఫర్‌జోన్ ఎక్కడి వరకు ఉందనేది కూడా అధికారులకు క్లారిటీ లేదు
హసన్ నస్రల్లా ఎవరు ?
- హసన్ నస్రల్లా 1960 ఆగస్టు 31న బీరుట్ నగరం ఉత్తర శివారులోని బుర్జ్ హమ్ముద్‌లో జన్మించారు. ఒక పేద కిరాణా వ్యాపారి తొమ్మిది మంది పిల్లలలో నస్రల్లా ఒకరు.
- నస్రల్లా ఇరాక్‌లోని షియా పవిత్ర నగరం నజాఫ్‌లోని మదర్సాలో మూడు సంవత్సరాలు రాజకీయాలు, ఖురాన్‌లను అభ్యసించారు.
- 1978లో లెబనాన్‌లోని సున్నీ ఆధిపత్య ప్రభుత్వం షియా కార్యకర్తలపై దాడులు చేయించింది. అప్పటి నుంచే లెబనాన్ రాజకీయాల్లో నస్రల్లా యాక్టివ్‌గా మారారు.
- లెబనాన్ అంతర్యుద్ధం టైంలో అమల్ అనే షియా మిలిటెంట్ సంస్థలో హసన్ నస్రల్లా పనిచేశారు.
- 1982లో ఇజ్రాయెల్ దళాలు బీరుట్‌పై దాడికి దిగాయి. ఆ సమయంలో అమల్ నుంచి విడిపోయి హిజ్బుల్లాను హసన్ నస్రల్లా స్థాపించారు.
- 2000 మేలో హిజ్బుల్లా భీకర దాడులు చేయడంతో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన దళాలను వెనక్కి తీసుకుంది. 22 ఏళ్ల తర్వాత లెబనాన్‌లోని కబ్జా చేసిన ప్రాంతాలను ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయింది. దీంతో లెబనాన్‌లో హసన్ నస్రల్లాకు మంచి పేరు వచ్చింది.
- సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలనకు మద్దతుగా అక్కడికి హిజ్బుల్లా మిలిటెంట్లను పంపిన చరిత్ర నస్రల్లాకు ఉంది.
- ఇజ్రాయెల్‌తో జరిగిన 2006 యుద్ధంలో హసన్ నస్రల్లా అప్పుడప్పుడు బహిరంగంగా కనిపించేవారు.
- 2011లో బీరుట్ దక్షిణ శివారులో జరిగిన ఒక మతపరమైన ఊరేగింపులో హసన్ నస్రల్లా కనిపించారు.