భారత్ చుట్టూ చైనా సైనిక వ్యూహం.. పెంటగాన్ నివేదికలో సంచలన విషయాలు!

మలక్కా స్ట్రెయిట్ వద్ద అమెరికా, భారత నావికాదళాల నుండి ముప్పు పొంచి ఉందన్నది చైనా ప్రధాన ఆందోళనగా నివేదిక పేర్కొంది. అలాగే హోర్ముజ్ స్ట్రెయిట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్య సముద్ర మార్గాల భద్రతపై కూడా చైనా ఆందోళన చెందుతోంది.

Published By: HashtagU Telugu Desk
Pentagon

Pentagon

Pentagon: అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన వార్షిక నివేదికలో చైనా తన సైన్యాన్ని భారత సరిహద్దులకు సమీపంలో మోహరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్‌లలో సైనిక స్థావరాలు లేదా లాజిస్టిక్స్ బేస్‌లను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల చైనా జల, వాయు, భూ దళాల శక్తి పెరగడమే కాకుండా సముద్ర మార్గాల్లో వారి పట్టు బిగుస్తుంది.

భారత్ పొరుగు దేశాల్లో చైనా ఏం చేస్తోంది?

పెంటగాన్ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పటికే జిబౌటిలో సైనిక స్థావరాన్ని, కంబోడియాలోని రీమ్ నావల్ బేస్‌లో పట్టును సాధించింది. ఇప్పుడు భారత్ చుట్టూ ఉన్న దేశాలపై దృష్టి సారించింది.

పాకిస్థాన్: గ్వాదర్ నౌకాదళ స్థావరాన్ని చైనా సహకారంతో నిర్మిస్తున్నారు. పాకిస్థాన్‌కు 35 J-10C ఫైటర్ జెట్‌లు, హ్యాంగోర్ క్లాస్ సబ్‌మెరైన్లు, యుద్ధనౌకలు, 5వ జనరేషన్ FC-31 ఫైటర్ జెట్‌లను చైనా ఆఫర్ చేసింది. JF-17 ఫైటర్ జెట్‌ల తయారీలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.

Also Read: 2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

బంగ్లాదేశ్: ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో చైనా ఉంది. బంగ్లాదేశ్ కూడా J-10C ఫైటర్ జెట్‌ల కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే చైనా నుండి VT-5 లైట్ ట్యాంకులు, రెండు మింగ్ క్లాస్ సబ్‌మెరైన్లు, యుద్ధనౌకలను బంగ్లాదేశ్ అందుకుంది.

శ్రీలంక- మయన్మార్: ఈ దేశాల్లో సాధారణ సైనిక సౌకర్యాలు లేదా లాజిస్టిక్స్ బేస్‌లను నిర్మించడం ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని విస్తరించాలని చైనా యోచిస్తోంది.

చైనా ప్రధాన ఆందోళన ఏమిటి?

మలక్కా స్ట్రెయిట్ వద్ద అమెరికా, భారత నావికాదళాల నుండి ముప్పు పొంచి ఉందన్నది చైనా ప్రధాన ఆందోళనగా నివేదిక పేర్కొంది. అలాగే హోర్ముజ్ స్ట్రెయిట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్య సముద్ర మార్గాల భద్రతపై కూడా చైనా ఆందోళన చెందుతోంది. దీనికోసం అంగోలా, క్యూబా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, UAE వంటి దాదాపు డజనుకు పైగా దేశాల్లో బేస్‌లు నిర్మించే చర్చలు జరుపుతోంది.

భారత్‌పై పడే ప్రభావం ఏమిటి?

భారత్-అమెరికా స్నేహాన్ని అడ్డుకోవడానికి చైనా పాకిస్థాన్‌తో తన సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల మోదీ-జిన్ పింగ్ భేటీల తర్వాత LAC వద్ద ఉద్రిక్తతలు తగ్గినా, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తన ‘కోర్ ఇంట్రెస్ట్’ (కీలక ఆసక్తి) జాబితాలో చేర్చుకోవడం గమనార్హం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ చర్యలన్నీ భారత్‌ను చుట్టుముట్టడానికి చైనా వేస్తున్న ‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్’ వ్యూహంలో భాగమే. చైనా పెరుగుతున్న సైనిక శక్తిపై అమెరికా నిశితంగా నిఘా ఉంచుతోంది.

  Last Updated: 24 Dec 2025, 05:10 PM IST