Elon Musk – TikTok : అమెరికా జనాభా దాదాపు 30 కోట్లు. వారిలో దాదాపు 17 కోట్ల మంది చైనా సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. అమెరికా ప్రజల్లో ఇంత రీచ్ ఉంది కాబట్టే అమెరికాలోని టిక్‌టాక్ వ్యాపారాన్ని అమెరికా కంపెనీకే అమ్మేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. జనవరి 19లోగా అమెరికాలోని టిక్‌టాక్ వ్యాపారాన్ని అమెరికా కంపెనీకి చైనా అమ్మేయాలని కోర్టు షరతు విధించింది. ఒకవేళ ఈ షరతును అమలుపర్చకపోతే.. అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి వస్తుంది. ఇది జరగడానికి ఇంకో ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ తరుణంలో ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌లో(Elon Musk – TikTok) ఓ సంచలన కథనం ప్రసారమైంది. అమెరికాలోని టిక్‌టాక్ వ్యాపారాన్ని అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు అమ్మేయాలని చైనా యోచిస్తోంది అనేది ఆ కథనం సారాంశం.
Also Read :Working Hours Ranking : అత్యధిక, అత్యల్ప పని గంటలున్న దేశాలివే.. భారత్ ర్యాంకు ఇదీ
టిక్‌టాక్ అనేది దాని మాతృ సంస్థ ‘బైట్ డ్యాన్స్’ ఆధీనంలోనే ఉండాలి అనే దానికి చైనా తొలి ప్రాధాన్యత ఇస్తోందట. అందుకోసం చివరిదాకా అమెరికాలో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుందట. ఒకవేళ ఈ న్యాయపోరాటంలో తగిన ఫలితం రాకపోతే.. ఎలాన్ మస్క్‌కు టిక్‌టాక్‌ను విక్రయించే అంశాన్ని పరిశీలించాలని చైనా భావిస్తోందట. ఎలాన్ మస్క్‌కు కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా అమెరికాలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో ‘గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ (DOGE) విభాగం సారథిగా ఎలాన్ మస్క్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. అందుకే ఎలాన్ మస్క్‌కు తమ వ్యాపారాన్ని అప్పగించడం సురక్షితంగా, లాభదాయకంగా ఉంటుందని చైనా అనుకుంటోందట.
Also Read :Shalini Pandey : అర్జున్ రెడ్డి భామ అందాల ఎటాక్..!
గత నెలలో నేరుగా డొనాల్డ్ ట్రంప్‌తో టిక్‌టాక్ కంపెనీ సీఈఓ భేటీ అయ్యారు. అందులో అంతర్గతంగా ఏం చర్చించారనే విషయం బయటికి రాలేదు. ఈ మీటింగ్ జరిగిన నెల రోజుల తర్వాత టిక్‌టాక్‌ను ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్‌కు విక్రయించే అంశంపై వార్తలు బయటికి రావడం గమనార్హం. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల తయారీ ప్లాంటు చైనాలోనూ ఉంది. చైనాతో మస్క్ మొదటి నుంచే మంచి సంబంధాలను నెరుపుతున్నారు. డ్రాగన్‌కు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. ఎలాన్ మస్క్ వ్యాపారాల్లో చైనా బ్యాంకుల పెట్టుబడులు ఉన్నాయనే టాక్ కూడా ఉంది. ఒకవేళ ఎలాన్ మస్క్ చేతికి టిక్ టాక్ చిక్కితే.. ఎక్స్, టిక్ టాక్‌లను కలిపి వినూత్నంగా, వైవిధ్యంగా ముందుకు తీసుకుపోయే అవకాశాలు ముమ్మరంగా ఉంటాయి.