మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ!

అరబ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
CBSE Class 12 Result

CBSE Class 12 Result

CBSE: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా సీబీఎస్ఈ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ జరగాల్సిన 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కానీ, విద్యార్థులు హాజరుకావడం కానీ సాధ్యం కాదని బోర్డు స్పష్టం చేసింది.

బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల్లో ఈ పరీక్షలను రద్దు చేశారు. ఆయా దేశాల్లోని పాఠశాలలు, విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చిన సూచనల మేరకు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మార్చి 1, 3, 5, 7, 9 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను ఐదుసార్లు వాయిదా వేశారు. అయితే పరిస్థితి మెరుగుపడే సూచనలు లేకపోవడంతో మిగిలిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.

Also Read: వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

ఫిబ్రవరి 28 నుంచి మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం

మిడిల్ ఈస్ట్‌లో 28 ఫిబ్రవరి 2026 నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ మొదట ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి అనేక దేశాలపై మిస్సైళ్లు , డ్రోన్లతో దాడులు చేసి విధ్వంసం సృష్టించింది. ఇరాన్ దాడుల వల్ల ఈ దేశాలు భారీ నష్టాన్ని చవిచూశాయి.

అరబ్ దేశాల్లో కోటి మంది భారతీయులు

అరబ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు తమ పౌరులను అరబ్ దేశాల నుండి తరలించాయి. భారత్ కూడా ఇరాన్, దుబాయ్‌లో నివసిస్తున్న తన ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. ఇరాన్ కేవలం అమెరికా సైనిక స్థావరాలనే కాకుండా రాయబార కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది.

  Last Updated: 15 Mar 2026, 03:28 PM IST