BAN: కొత్త సంవత్సరం మొదటి రోజే అమెరికాకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా పౌరులు తమ దేశంలోకి ప్రవేశించకుండా రెండు దేశాలు నిషేధం విధించాయి. అధ్యక్షుడు ట్రంప్ తమ దేశాలపై విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు దేశాలు కూడా ఫిఫా వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే వరల్డ్ కప్ సమయంలో క్రీడాకారులకు మాత్రమే అమెరికాలోకి ప్రవేశం ఉంటుందని, సామాన్య ప్రజలను అనుమతించబోమని ట్రంప్ ఆదేశాలు జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం.
నిర్ణయాన్ని ధృవీకరించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు
బుర్కినా ఫాసో విదేశాంగ మంత్రి కరామో జీన్ మేరీ ట్రావోరే ఈ నిషేధాన్ని ధృవీకరించారు. అమెరికా తమ పౌరులపై ఎలాంటి నిబంధనలు విధిస్తుందో.. అమెరికా పౌరులకు కూడా బుర్కినా ఫాసోలో అవే నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మాలి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేసినప్పటికీ నిషేధాన్ని ధృవీకరించింది. మాలి ప్రజలపై అమెరికా అమలు చేస్తున్న నిబంధనలనే తాము కూడా అమెరికన్లపై అమలు చేస్తామని, వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read: కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..
39 దేశాలపై ట్రంప్ ఆంక్షలు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా యంత్రాంగం మొత్తం 39 దేశాల ప్రజలపై ఆంక్షలు విధించింది. కొన్ని దేశాలపై పూర్తిస్థాయి నిషేధం విధించగా, మరికొన్ని దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ జాబితాలో 25 ఆఫ్రికా దేశాలు ఉండటం గమనార్హం. సిరియా, పాలస్తీనా, నైజీరియా, దక్షిణ సూడాన్, సియెర్రా లియోన్ దేశాల ప్రజలపై అమెరికా పూర్తిస్థాయి నిషేధం విధించగా, సెనెగల్, ఐవరీ కోస్ట్ దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించింది.
ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో వివాదం
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, సామాన్య ప్రజల ప్రవేశంపై అమెరికా ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది. ఈ 39 దేశాలకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల్లో.. క్రీడాకారులను అనుమతిస్తామని, కానీ సామాన్య ప్రజలకు నిబంధనల ప్రకారమే ప్రవేశం ఉంటుందని పేర్కొంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభావిత దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగానే మాలి, బుర్కినా ఫాసోలు మొదటగా ఈ చర్యలు చేపట్టాయి.
