అమెరికాలో ఒక ప్రయాణికుడు తన బ్లూటూత్ పరికరానికి సరదాగా పెట్టిన పేరు పెను కలకలం సృష్టించింది. ‘బాంబ్’ అనే పేరుతో సిగ్నల్ కనిపించడంతో, స్పెయిన్‌కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీది నుంచి వెనక్కి తిరిగివచ్చి, అమెరికాలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం 190 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి స్పెయిన్‌కు బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటి తర్వాత, సిబ్బంది ‘బాంబ్’ అనే పేరుతో ఉన్న ఓ బ్లూటూత్ డివైజ్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులందరూ తమ బ్లూటూత్ కనెక్షన్లను ఆపేయాలని పదేపదే అనౌన్స్ చేశారు. అయినా కొన్ని డివైజ్‌లు యాక్టివ్‌గా కనిపించాయి. ఇందులో ‘బాంబ్’ పేరుతో ఉన్న డివైజ్ కూడా ఉంది. దీంతో పైలట్లు జనరల్ ఎమర్జెన్సీ ప్రకటించి, విమానాన్ని వెనక్కి మళ్లించారు.
తిరిగి నెవార్క్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, పోర్ట్ అథారిటీ పోలీసులు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక టీనేజ్ ప్రయాణికుడు తన బ్లూటూత్ పరికరానికి ఆ పేరు పెట్టినట్లు విచారణలో గుర్తించారు. విమానాన్ని, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన కారణంగా విమానం తొమ్మిది గంటలకు పైగా ఆలస్యంగా స్పెయిన్‌కు చేరుకుంది. భద్రతాపరమైన ఆందోళన కారణంగానే విమానాన్ని వెనక్కి మళ్లించామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
