Benin Blast : నైజీరియా బార్డర్ లో ఉండే బెనిన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో సీజ్ చేసి ఉంచిన ఇంధన డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 34 మంది సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. తీవ్ర గాయాలపాలైన మరో మరో 20 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గతంలో ప్రభుత్వం సీజ్ చేసిన ఈ ఇంధన డిపోలోని గోదాములో.. కొందరు అక్రమంగా నిల్వ ఉంచిన మండే స్వభావం కలిగిన వస్తువుల వల్లే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.
Also read : Guava Leaves Benefits: జామ పండే కాదు ఆకులు కూడా దివ్యౌషధమే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..!
అక్రమంగా తీసుకొచ్చిన ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ఈ ఇంధన డిపో వద్ద స్థానికులు కార్లు, మోటార్‌బైక్‌లు, ఆటోలలో క్యూలో నిలబడి ఉండగా పేలుడు సంభవించిందని బెనిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సజీవ దహనమైన బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. బెనిన్ లో ఇంధన అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ఇప్పుడు జరిగిన పేలుడు ఘటన కూడా దానితో ముడిపడినదే. సీజ్ చేసిన ఇంధన డిపోలో రహస్యంగా ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు జనం బారులు తీరారు. ఈక్రమంలో ఆ పాతబడిన ఇంధన డిపోలో ఏదో జరిగి పేలుడు (Benin Blast) సంభవించింది.