Site icon HashtagU Telugu

Bangladesh : బంగ్లాదేశ్ మరో పాక్ కాబోతుందా..?

Bangladesh To Become Next P

Bangladesh To Become Next P

బంగ్లాదేశ్ (Bangladesh ) ..ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రిజర్వేషన్ల ఉద్యమ రూపంలో చెలరేగిన నిప్పురవ్వ… మహోగ్ర ఉద్యమమై ఏకంగా ప్రధానమంత్రి పదవికే ఎసరు తెచ్చింది. కోటాలో మార్పుల డిమాండ్‌తో మొదలైన నిరసనలు..వందలాంది మంది ప్రాణాలు పోయేలా చేసింది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు హింసాత్మక ఘటనలతో ఎప్పుడు ఏమవుతుందో..అనే ఆందోళన పెంచుతుంది. అధికార అవామీలీగ్, సైన్యం…నిరసనలు ఆపేందుకు కఠినాతికఠిన నిర్ణయాలు తీసుకున్నా…ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. రిజర్వేషన్లను తగ్గించాలన్న బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆందోళకారులను శాంతింపచేయలేకపోయింది.

1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను తేచ్చింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అయితే 2018లోనే ఈ రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అప్పుడు విద్యార్థులు నిరసన తెలియజేయటం వల్ల వెనక్కి తగ్గింది. కానీ, ఈ ఏడాది జూన్‌లో బంగ్లా హైకోర్టులో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటం వల్ల మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమణిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటివరకు ఈ నిరసనల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే బంగ్లా మరో పాకిస్థాన్ కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా నేపథ్యంలో ఆమె కుమారుడు సాజీద్‌ వాజెద్‌ జాయ్‌ (Sheikh Hasina’s Son Sajeeb Wazed) సైన్యానికి కీలకసూచన చేశారు. ప్రజల చేత ఎన్నిక కానివారికి ప్రభుత్వాన్ని అప్పగించవద్దని సూచించారు. ఒకవేళ వారికి ప్రభుత్వాధికారం అప్పగిస్తే, బంగ్లాదేశ్‌ మరో పాకిస్థాన్‌ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్‌ సాధించిన ప్రగతి నాశనం అవుతుందని హసీనా కుమారుడు ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బంగ్లాదేశ్‌ తిరిగి పురోగతి సాధించే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంతవరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా రాజకీయ శరణార్థిగా ఉండేందుకు యూకేను ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్‌లో ఉండేందుకు ఢిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక బంగ్లాలో ఏర్పడిన సంక్షోభం ఫై మంగళవారం ప్రధానమంత్రి మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంగ్లా పరిస్థితుల గురించి విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ అఖిలపక్ష నేతలకు వివరించారు. అయితే బంగ్లాలో ప్రమాదకర పరిస్థితులేం లేవని.. అక్కడి నుంచి భారతీయుల్ని తరలించే అవసరం రాదని ఆయన తెలిపారు. అక్కడి పరిస్థితులను అత్యంత అప్రమత్తంగా పరిశీలిస్తున్నామని.. ఏం జరిగినా క్షణాల్లో చర్యలు తీసుకునేలా రెడీగా ఉన్నామని వెల్లడించారు.

Read Also : Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్