Bangladesh Protests : బంగ్లాదేశ్ మళ్లీ భగ్గమంది. విద్యార్థులు మరోసారి నిరసనలు తెలిపేందుకు రోడ్లపైకి పోటెత్తారు. గతంలో నిరసనల ధాటికి తాళలేక నాటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పరార్ అయ్యారు. ఈసారి బంగ్లాదేశ్ విద్యార్థులు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. దేశ రాజధాని ఢాకాలోని సెంట్రల్ షాహీద్‌మినార్ వద్ద విద్యార్థులు తొలుత నిరసన తెలిపారు. అనంతరం నేరుగా అధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టడించారు. రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆగస్టులో విద్యార్థి ఉద్యమం(Bangladesh Protests) జరిగిన వేళ మాజీ ప్రధాని షేక్‌హసీనాకు అనుకూలంగా అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ వ్యవహరించారని విద్యార్థులు మండిపడ్డారు. 1972లో రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి.. బంగ్లాదేశ్ కోసం కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని కోరారు. షేక్ హసీనా రాజకీయ పార్టీ అవామీ లీగ్‌కు చెందిన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్‌ను బ్యాన్ చేయాలని విద్యార్థులు కోరారు. షేక్ హసీనా హయాంలో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధమని ప్రకటించాలని విద్యార్థులు కోరారు. బంగ్లాదేశ్‌ను రిపబ్లిక్ దేశంగా అనౌన్స్ చేయాలన్నారు.
Also Read :Priyanka Gandhi : వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్.. రాహుల్ ఏమన్నారంటే..
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా హయాంలో జులై మొదటి వారం నుంచి ఆగస్టు మొదటివారం దాకా బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు హోరెత్తాయి. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. అయితే వారితో షేక్ హసీనా విభేదించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈక్రమంలో షేక్ హసీనా రాజకీయ పార్టీ అవామీ లీగ్ నాయకులు, పోలీసులు, భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. ఈ ఆందోళనలు ఆగకపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు పారిపోయారు. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. వచ్చే ఏడాది అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉందని భారత్ ఆరోపిస్తోంది. ఐఎస్ఐ ప్రమేయం ఉన్నందు వల్లే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని వాదిస్తోంది.