Site icon HashtagU Telugu

Bangladesh Elections : బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పార్టీ బంపర్ విక్టరీ.. 200 సీట్లు కైవసం

Bangladesh Elections

Bangladesh Elections

Bangladesh Elections : అందరి అంచనాలను నిజం చేస్తూ బంగ్లాదేశ్‌ ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనాకు చెందిన రాజకీయ పార్టీ అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. 266 పార్లమెంటు స్థానాల్లో పోటీచేసిన అవామీ లీగ్.. 200 సీట్లలో గెలిచిందని  ఎన్నికల సంఘం ప్రతినిధి వెల్లడించారు. దీంతో ఐదోసారి బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. మరోవైపు పలు స్థానాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నంలోగా మిగతా స్థానాల ఫలితం కూడా రిలీజ్ అవుతుంది. ‘‘ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ ఆధారంగా అవామీ లీగ్​ను విజేతగా ప్రకటిస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యాక తుది ఫలితాలు వెల్లడిస్తాం’’ అని ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ప్రధాని షేక్‌ హసీనా తాను పోటీ చేసిన గోపాల్‌గంజ్‌-3 స్థానంలో బంపర్ మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఆమెకు 2,49,965 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం నిజాముద్దీన్ లష్కర్​కు 469 ఓట్లే వచ్చాయి. 1986 నుంచి ఇప్పటివరకు ఈ స్థానం నుంచి హసీనా విజయం సాధించడం ఇది(Bangladesh Elections) ఎనిమిదోసారి.

We’re now on WhatsApp. Click to Join.

బంగ్లాదేశ్‌లోని మొత్తం 300 పార్లమెంటు స్థానాలకుగానూ ఆదివారం 299 సీట్లకు పోలింగ్‌ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం BNP పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో 40 శాతమే ఓటింగ్ నమోదైంది. చివరిసారి 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మందికిపైగా ఓటేశారు. తమ బాయ్​కాట్ ఉద్యమం ఫలించిందని, అందుకే ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయిందని బీఎన్​పీ నేతలు చెబుతున్నారు. ఇక బీఎన్​పీపై షేక్ హసీనా విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆ పార్టీకి, కూటమికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు.

భారత్‌పై ప్రశంసల వర్షం

అంతకుముందు ఆదివారం రోజు ఓటువేసిన తర్వాత బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా మీడియాతో మాట్లాడుతూ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ తమకు  నమ్మకమైన భాగస్వామి అని తెలిపారు. లిబరేషన్ వార్ టైంలో భారత్ చేసిన సాయాన్ని మర్చిపోలేమన్నారు. 1975 తర్వాత తాము సర్వం కోల్పోయినప్పుడు కూడా భారత్ తమకు ఆశ్రయం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇండియాకు రుణపడి ఉంటామని హసీనా పేర్కొన్నారు. 1971లో జరిగిన తూర్పు పాకిస్తాన్ విముక్తి యుద్ధంలోనూ బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ ఎంతో సాయం చేసిందని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులోనూ భారత్‌తో మెరుగైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని వెల్లడించారు. మొత్తం మీద విపక్షాల ఎన్నికల బహిష్కరణ షేక్ హసీనా విజయానికి లైన్ క్లియర్ చేసిందనే విస్పష్టం.

Also Read: Banarasi Sarees : రామమందిరం థీమ్‌తో బనారసీ చీరలు.. ఆ మూవీ ప్రతీ టికెట్‌పై రూ.5 రామమందిరానికి