Site icon HashtagU Telugu

Bangladesh : షేక్‌ హసీనాపై బంగ్లాదేశ్‌ రెండో అరెస్టు వారెంట్‌ జారీ

Bangladesh issues second arrest warrant against Sheikh Hasina

Bangladesh issues second arrest warrant against Sheikh Hasina

Bangladesh : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యూనల్‌ (ఐసీటీ)సోమవారం మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ ప్రకారం, ఫిబ్రవరి 12వ తేదీ నాటికి కోర్టు ఎదుట హాజరుపర్చాలని గడువు విధించారు. ఈ వారెంట్‌లో హసీనాతో పాటు మరో 12మంది పేర్లను కూడా చేర్చారు. హసీనా రక్షణ సలహాదారు మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) తారిక్‌ అహ్మద్‌ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్‌ అహ్మద్‌, మాజీ నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ మానిటరింగ్‌ సెంటర్‌ డీజీ జియావుల్‌ అహ్‌సాన్‌ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. దేశంలో జరిగిన పలువురు అదృశ్యాలు,హత్యలకు సంబంధించి ఈ చర్య చేపట్టబడింది. హసీనా భారత్‌కు వెళ్లిపోయిన తరువాత, ఆమెపై జారీ అయిన రెండవ వారెంట్ ఇది. ఈ సారి ఐసీటీ, ఇంటర్‌పోల్ సహాయాన్ని కూడా కోరింది.

కాగా, గతేడాది అక్టోబర్‌లో హసీనాపై మొదటి వారెంట్‌ జారీ చేశారు. అప్పుడు ఆమెతో పాటు 45 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నవంబర్‌ 18 నాటికి కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించినప్పటికీ, ఆ ఆదేశాలు అమలుకాలేదు. విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఉద్యమంలో ఆందోళనకారుల ప్రాణాలు తీసిన వారిని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యూనల్‌ ఎదుట హాజరుపరుస్తామని పేర్కొంది. జులై నెలలో విద్యార్థి ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. హసీనా దేశం విడిచిన తర్వాత చెలరేగిన హింసలో బంగ్లాదేశ్‌లో సుమారు 230 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇకపోతే..షేక్ హసీనా గత ఏడాది అవామీ లీగ్ పాలన పతనం కావడంతో భారత్‌కు వచ్చి తలదాచుకున్నారు. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా మరియు మాజీ మిలిటరీ జనరల్‌లు మరియు మాజీ పోలీసు చీఫ్‌తో సహా మరో 11 మందిపై బలవంతంగా అదృశ్యమైన సంఘటనలను ఆరోపిస్తూ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఆమెపై ధర్మాసనం ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసింది.

Read Also: Sankranthiki Vasthunam Trailer : సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసారా..?