Sheikh Hasina: మహమ్మద్ యూనస్ ఒక హంతకుడని షేక్ హసీనా ఆరోపించారు. దేశంలో హింసను ప్రేరేపించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను ఉగ్రవాదం, నేరాల ఊబిలోకి నెడుతున్నట్లు ఆమె విమర్శించారు. బంగ్లాదేశ్‌లో మతతత్వ శక్తులు ప్రశాంతతను భంగపరిచాయని షేక్ హసీనా పేర్కొన్నారు. “బంగ్లాదేశ్ ప్రజలు ప్రాణాలతో ఉండటానికి కూడా పోరాడుతున్నారు. ఇక్కడి సారవంతమైన భూములను బంజరుగా మార్చేశారు. దేశ శత్రువులు కుట్ర పన్ని, ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టారు. అప్పటి నుండి దేశంలో చట్టబద్ధమైన పాలన అంతమైపోయింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, మానవ హక్కులు తుంగలో తొక్కబడ్డాయని అన్నారు. “నేడు బంగ్లాదేశ్‌లో మహిళలకు రక్షణ లేదు. న్యాయం అనేది ఒక ఎగతాళిగా మారింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఏకమై గళమెత్తాలి” అని పిలుపునిచ్చారు.
Also Read: స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్‌పై చీటింగ్ కేసు..!
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభం
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మొదలైంది. ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికలకు ముందు ప్రధాన రాజకీయ పార్టీలు రాజధాని ఢాకా, ఇతర ప్రాంతాలలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి: షేక్ హసీనా
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌ను లక్ష్యంగా చేసుకుని షేక్ హసీనా విమర్శలు గుప్పించారు. ఆమె మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్‌లో ప్రతి చోటా విధ్వంసం జరుగుతోంది. ప్రాణాలతో బయటపడటానికి ప్రజలు చేస్తున్న పోరాటంలో వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. హంతకుడు, ఫాసిస్ట్ అయిన యూనస్ కేవలం డబ్బు దోపిడీ, అధికార దాహంతో ప్రేరేపించబడ్డాడు. అతను దేశాన్ని రక్తంతో తడిపివేస్తున్నాడు. మన మాతృభూమి ఆత్మను అపవిత్రం చేశాడు. ఆగస్టు 5, 2024న ఒక పక్కా ప్రణాళిక ప్రకారం దేశ శత్రువులు, హంతకుడు యూనస్, అతని దేశ వ్యతిరేక తీవ్రవాద మిత్రులు నన్ను బలవంతంగా అధికారం నుండి దించేశారు” అని పేర్కొన్నారు.
