Site icon HashtagU Telugu

China Dictatorship : చైనా నియంతృత్వ విశ్వరూపం బయటపెట్టిన ఒక ఫోటో..

Ban On Single Photo Reveals The Monumental Dictatorship Of China.

Ban On Single Photo Reveals The Monumental Dictatorship Of China.

By: డా. ప్రసాదమూర్తి

Monumental Dictatorship of China : నియంతృత్వం ఏ రూపంలో ఉంటుందని ఎవరైనా అడిగితే, ఫలానా రూపంలో ఉంటుందని చెప్పలేం. దేవుడు ఎక్కడ ఉంటాడని ఎవరైనా అడిగితే ఇందుగలడందులేడని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే గలడు పరమాత్ముడు అని భక్తులు సమాధానం చెప్తారే, అలా నియంతృత్వం కూడా ఎక్కడ వెతికితే అక్కడే కనిపిస్తుంది. దీనికి తాజాగా చైనాలో (China) జరిగిన ఒక చిన్న ఘటన ఉదాహరణగా చూపించవచ్చు. చైనాలో ఏషియన్ గేమ్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలుసు కదా.

ఏ దేశానికి చెందిన క్రీడాకారులు ఏ చిన్న పతకం సాధించినా, ఆ దేశం గొప్పగా చెప్పుకుంటుంది. ఆ దేశానికి సంబంధించిన మీడియా, వారి వీడియోలను.. ఫోటోలను ప్రదర్శించి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇది సహజంగా జరిగే విషయమే. ఎవరి క్రీడాకారులంటే వారికి గొప్పే కదా. అదేం విచిత్రమో గాని, చైనా (China) మాత్రం, ఇద్దరు తమ క్రీడాకారిణులు పతకాలు గెలిచినా, వారి ఫోటోలు మాత్రం బహిష్కరించి చైనా నియంత పోకడల విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కారణం తెలుసుకుంటే ఎవరైనా విస్తు పోతారు..నవ్విపోతారు.. ఇంత దారుణమా.. చైనాలో ఇంత నియంత ఉన్నాడా అని గుండెలు బాదుకుంటారు.

ఏషియన్ గేమ్స్ లో చైనాకు సంబంధించిన ఇద్దరు క్రీడాకారిణులు 100 మీటర్స్ హర్డిల్స్ లో విజయం సాధించి ఆనందం పట్టలేక ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. వారు ఆ లింగనం చేసుకున్న ఆ దృశ్యం ఫోటో రూపంలో వైరల్ అయింది. వైరల్ కావడానికి కౌగిలి కారణం కాదు. ఆ ఇద్దరు క్రీడాకారుల నెంబర్లు కారణం. ఒకరి నెంబర్ 6, మరొకరు నెంబరు 4. ఇద్దరూ విజయోత్సవంతో ఆనందాన్ని పంచుకుంటూ కౌగిలించుకున్నప్పుడు ఆ ఇద్దరి నెంబర్లు పక్కపక్కనే ఇద్దరితో పాటు కనిపించాయి.

అంటే 6, 4 పక్కపక్కనే ఉన్నాయి. ఇలా ఈ రెండు నెంబర్లు ఓ చోట కనిపించడంతో చైనా ప్రభుత్వం (China Government) కస్సుమని లేచింది. వెంటనే ఆ ఫోటోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బ్యాన్ చేసి పడేసింది. చైనాకు తమ సొంత క్రీడాకారుల మీదనే ఇంత ఆగ్రహం ఎందుకు కలిగిందబ్బా అని ఆరా తీస్తే అర్థమైంది ఒక విషయం. అది తెలిసిన తర్వాత మీరు కూడా నవ్వుతో కూడిన అసహ్యాన్ని కూడా చైనా పాలకుల నిర్ణయం పట్ల వ్యక్తం చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

జూన్ సంఖ్య ఆరు కదా. నాలుగు ఒక తేదీ. 6 , 4 పక్కపక్కనే ఉండడం అంటే జూన్ 4వ తేదీ అని అర్థం. ఇంతకీ జూన్ 4వ తేదీకి ఏంటి ప్రాముఖ్యత అంటే, 1989 జూన్ 4న చైనాలో తియానన్మెన్ స్క్వేర్ లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోరుకుంటూ లక్షలాది సంఖ్యలో చైనా యువత ప్రదర్శన చేసింది. ఆ ప్రదర్శన మీద చైనా పాలకులు మార్షల్ లా ప్రకటించి బీభత్సం సృష్టించారు. వేలాది మందిని అరెస్టులు చేశారు.

ఎంతో మంది ప్రాణాలు తీశారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల ఆకాంక్షల పట్ల చైనా ప్రదర్శించిన క్రూర కిరాతక నియంతృత్వం, స్వేచ్చను కోరుకునే మానవాళి మర్చిపోలేని ఒక ఘోర ఘటనగా అదెప్పుడూ గుర్తుండిపోతుంది. చైనా చరిత్రలో అదొక చీకటి తేదీగా ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఆ తేదీని తలుచుకుంటేనే చైనా ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. ఆ తేదీ ఇప్పుడు ఇలా ఇద్దరు క్రీడాకారులు విజయం సాధించిన సంబరంలో కౌగిలించుకున్న దృశ్యంలో 6,4 అనే సంఖ్య రూపంలో ప్రముఖంగా కనిపించింది.

అంతే, ఆ ఫోటో చైనా మొత్తం వైరల్ అయింది. జూన్ 4వ తేదీ ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపించడంతో స్వేచ్ఛా కాముకులైన చైనా ప్రజలు ఆ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంకేముంది, చైనా ప్రభుత్వం గంగవెర్రులెత్తిపోయింది. ఆగమేఘాల మీద ఆ ఫోటోని నిషేధించి చైనా అంతటి విశాల సామ్రాజ్యంలో ఎంతటి నియంత తిష్ఠవేసి ఉన్నాడో, ఆ నియంత విశ్వరూపాన్ని విశ్వానికంతా చూపించింది. పాపం ఆ క్రీడాకారులు విజయం సాధించామన్న ఆనందంతో ఒకరినొకరు ఆ లింగనం చేసుకొని ఎంత తప్పు చేశామో అని బాధపడాలా.., లేక మేం చేసిన తప్పేంటి, మా ఫోటోలో మా నెంబర్లు కనిపిస్తే అది ఆ ఫోటో తప్పేముంది? అంతమాత్రానికే నిషేధిస్తారా అని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు.

నోరు మూసుకోవాలి తప్ప అక్కడ నోరు విప్పడానికి తావుండదు. చూశారా ఒక్క ఫోటో.. రెండు నెంబర్లు.. మొత్తం ప్రపంచానికి చైనా నియంత్రత్వ నైజం ఏంటో తేల్చి చెప్పింది. వినడానికి విడ్డూరంగా ఉంది. చెప్పడానికి సిగ్గుచేటుగా ఉంది. చదవడానికి అసహ్యంగా ఉంది ఈ వార్త. అయినా ఇది జరిగింది. ప్రపంచ మీడియాలో ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. దటీజ్ చైనా.

Also Read:  Posani : సిగ్గులేదా రోజా..ఓ బిల్డప్ ఇస్తావ్..అంటూ రోజా ఫై పోసాని ఫైర్ ..