Attack On Pak Army : పాకిస్తాన్‌లో ఉగ్రదాడులు ఎంతకూ ఆగడం లేదు. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్‌లోని తుర్బత్ నగర శివార్లలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సూసైడ్ ఎటాక్ చేసింది. ఈ ఘటనలో 47 మంది సైనికులు చనిపోగా, 30 మందికి గాయాలయ్యాయి. బీఎల్‌ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ అనే ఫిదాయీ యూనిట్ ఈ దాడి చేసింది. సంగత్ బహర్ అలీ అనే యువకుడు ఈ దాడి చేసినట్లు తెలిసింది. అతడు తుర్బత్ నగర వాస్తవ్యుడేనని మీడియాలో కథనాలు వచ్చాయి. 2017 నుంచి అతడు బెలూచిస్తాన్ నేషనల్ మూవ్‌మెంట్‌లో పనిచేస్తున్నాడని, 2022లో బీఎల్‌ఏకు చెందిన ఫిదాయీ(సూసైడ్) టీమ్‌లో చేరాడని తెలిపారు. ఇక ఈ దాడి చేసింది తామేనని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయంద్ బెలూచ్(Attack On Pak Army) ప్రకటించారు.
Also Read :Telugu Movies: కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం..!
దాడి ఇలా జరిగింది..
5 బస్సులు, 8 సైనిక వాహనాలతో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ కరాచీ నగరం నుంచి బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని తుర్బత్ నగరంలో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వైపుగా బయలుదేరింది. దీనిపై బీఎల్‌ఏకు చెందిన ఇంటెలీజెన్స్ విభాగం జిరాబ్‌కు ముందే సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ సూసైడ్ ఎటాక్‌ను ప్లాన్ చేశారు. తుర్బత్ నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెహ్మన్ ఏరియాలో శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఈ సూసైడ్ ఎటాక్ జరిగింది. అయితే 11 మందే చనిపోయారని పాక్ సైన్యం తెలిపింది. మిలిటెంట్ సంస్థ బీఎల్‌ఏ మాత్రం తమ దాడిలో 47 మంది చనిపోయారని చెబుతోంది. తమ దాడిలో ఒక బస్సు, ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయని వాదిస్తోంది. మిగతా వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ బీఎల్ఏ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము దాడి చేసిన టైంలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌లో ఐంఐ 309 వింగ్, ఎఫ్‌సీ ఎస్ఐయూ వింగ్, ఎఫ్‌సీ 117 వింగ్, ఎఫ్‌సీ 326 వింగ్‌లకు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపింది. బెలూచిస్తాన్ గడ్డ పాక్ ఆర్మీకి సురక్షితం కానే కాదని బీఎల్ఏ హెచ్చరించింది.