Social Media Ban : యావత్ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్‌గా నిలిచే ఒక సంచలన నిర్ణయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించేందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఇవాళ ఉదయం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 102 మంది ఓట్లు వేయగా, 13 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆస్ట్రేలియాలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ బిల్లును సమర్ధించాయి. 16 ఏళ్లలోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనేది వారి ఆరోగ్యాలకు మంచిదనే అభిప్రాయాన్ని అన్ని పార్టీల ముఖ్యనేతలు వ్యక్తం చేశారు. తదుపరిగా ఈ బిల్లుకు ఆస్ట్రేలియా సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది. అక్కడ కూడా అప్రూవల్ లభిస్తే.. ఈ బిల్లు చట్టంగా మారిపోయి అమల్లోకి వస్తుంది. ఈ బిల్లును శనివారంలోగా ఆస్ట్రేలియా(Social Media Ban) సెనేట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read :RGV Video : నాపై కక్ష సాధింపు.. అప్పటి కామెంట్స్‌కు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా ? : ఆర్జీవీ
ఈ చట్టం అమల్లోకి వచ్చాక.. దాన్ని తు.చ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత సోషల్ మీడియా కంపెనీలపై ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ తెలిపారు. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిబంధనలను ఆయా కంపెనీలు అమలు చేయాలన్నారు. సోషల్ మీడియా వల్ల మైనర్లపై దుష్ప్రభావాలు పడుతున్నాయని తమకు తల్లిదండ్రుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటి వల్లే ఈ చట్టాన్ని చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆల్బనీస్ చెప్పారు. ఆస్ట్రేలియా బాలల ఆరోగ్యాన్ని కాపాడేందు కోసం తమ ప్రభుత్వం ఏదైనా చేస్తుందన్నారు. సోషల్ మీడియా వల్ల బాలల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంటే తాము చూస్తూ ఊరుకోలేమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అమెరికా, ఫ్రాన్స్, పలు యూరప్ దేశాలు కూడా ఇదే తరహా చట్టాన్ని చేయాలని యోచిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయాన్ని సోషల్ మీడియా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తాము చట్టాన్ని అమలు చేయడం కష్టమని చెబుతున్నాయి. కనీసం తమక ఇంకొక సంవత్సరం గడువు ఇస్తే.. ఈ చట్టం అమలుకు అనుగుణంగా తమ సోషల్ మీడియాల వ్యవస్థలలో మార్పులు చేస్తామని అంటున్నాయి.