Site icon HashtagU Telugu

Bangladesh : బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు ఆపండి.. ఐక్యరాజ్యసమితి పిలుపు

Attacks On Bangladesh Hindus

Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.  ఆ దాడులను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ కోరారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఈ హింస ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.  బంగ్లాదేశ్(Bangladesh) స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల సందర్భంగా పలు హిందూ ఆలయాలపైనా దాడులు జరిగాయి. మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీకి మద్దతుగా నిలిచిన ఇద్దరు హిందూ నాయకులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది.

We’re now on WhatsApp. Click to Join

భారత్ ప్రత్యేక కమిటీ

ఈ అంశంపై బంగ్లాదేశ్‌తో కలిసి పని చేసేందుకు భారత ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతా వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. బీఎస్‌ఎఫ్‌ తూర్పు కమాండ్‌ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీని నియమించినట్లు భారత హోంశాఖ వెల్లడించింది.ఈ కమిటీలో దక్షిణ బెంగాల్‌, త్రిపుర విభాగాల బీఎస్‌ఎఫ్‌ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.

బంగ్లాదేశ్‌లో చౌకగా వైద్యవిద్య

బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల కారణంగా జులై చివరి నాటికి దాదాపు 7 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారు. బంగ్లాదేశ్‌లో చదువుకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండటంతో అక్కడికి పెద్దసంఖ్యలో భారత విద్యార్థులు వెళ్తున్నారు. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2022లో భారత్ నుంచి 13 లక్షల మంది చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్లగా, వారిలో 9,308 మంది ఒక్క బంగ్లాదేశ్‌‌కే వెళ్లారు.మన దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చేయాలంటూ రూ.50 లక్షల దాకా ఖర్చవుతుంది. అదే బంగ్లాదేశ్‌లో అయితే రూ.30 లక్షలు ఉంటే సరిపోతుంది. అందుకే అక్కడి మెడిసిన్ చేసేందుకు ఇండియన్స్ ఆసక్తి చూపుతున్నారు.