అమెరికా(America)లో పౌరసత్వ పరీక్షను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ (Trump) పరిపాలన భావిస్తుండటంతో భారతీయుల సహా అనేక మంది వలసదారుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో చేసిన ప్రకటన ప్రకారం… ప్రస్తుతం ఉన్న పౌరసత్వ పరీక్ష తేలికగా ఉందని, కేవలం జ్ఞాపకశక్తితో ఉత్తీర్ణత సాధించవచ్చని పేర్కొన్నారు. అందుకే పరీక్షను మళ్లీ గాఢంగా, విలువలపై ఆధారపడి ఉండేలా మార్చాలని భావిస్తున్నారు. ట్రంప్ 2020లో చేసిన మార్పులనేపేరుతో అదే పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
అమెరికా పౌరసత్వాన్ని పొందాలంటే, గ్రీన్‌కార్డ్ ఉన్న వారు ‘నాచురలైజేషన్ టెస్ట్’ రాయాల్సి ఉంటుంది. ఇందులో N-400 ఫారంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ చెక్, అర్హతలు వంటి ఇతర ప్రక్రియలు ఉంటాయి. చివరగా ఇంటర్వ్యూలో భాగంగా ఇంగ్లీష్ భాషా నైపుణ్యం మరియు పౌరశాస్త్రం (సివిక్స్)పై పరీక్ష ఉంటుంది. ఇప్పటికీ అమల్లో ఉన్న విధానం ప్రకారం 100 ప్రశ్నల జాబితాలో నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో కనీసం 6 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
అయితే ట్రంప్ తొలి పాలనలో 2020లో ఈ పరీక్షను కఠినతరం చేస్తూ 128 ప్రశ్నల జాబితా ప్రవేశపెట్టారు. పరీక్షలో 20 ప్రశ్నలు అడిగేవారు, అందులో 12కి సరైన సమాధానాలిచ్చినవారే ఉత్తీర్ణులయ్యేవారు. ఆ విధానం విమర్శల కారణంగా తొలగించబడినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పులు పౌరసత్వాన్ని ఆశిస్తున్న వలసదారులకు ఒక విధంగా అడ్డంకిగా మారవచ్చు.
ఇది సరిపోదన్నట్టు H-1B వీసాల విషయంలో కూడా పెద్ద మార్పులు జరుగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం ఇకపై H-1B వీసాలు కేవలం అధిక నైపుణ్యం, ఎక్కువ జీతాలు ఉన్న ఉద్యోగాలకే పరిమితమవుతాయి. దీని ద్వారా తక్కువ జీతాలకు విదేశీయులను నియమించడాన్ని నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, యువతపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో కెరీర్‌ను స్థిరపరచాలని కలలు కనే వారికి ఇది నిరాశ కలిగించొచ్చు.