Site icon HashtagU Telugu

H-1B Visa: హెచ్‌-1బీ వీసాపై ట్రంప్ వైఖరిలో మార్పు!

H-1B Visa

H-1B Visa

H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా (H-1B Visa) విధానంపై తన వైఖరిని గణనీయంగా మృదువుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీసా ఫీజులను రెట్టింపు చేసి, కొత్త H-1B వీసా దరఖాస్తులకు దాదాపు 88 లక్షల రూపాయలకు ($100,000) పెంచిన ట్రంప్.. ఇప్పుడు ఈ వీసా అమెరికాకు అవసరమని నొక్కి చెప్పారు.

ట్రంప్ అభిప్రాయంలో మార్పు

H-1B వీసా వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. “అమెరికాలో ప్రతిభావంతులైన అమెరికన్ కార్మికుల కొరత ఉన్నందున H-1B వీసాలు దేశానికి అవసరం” అని అన్నారు. ఈ విదేశీ నిపుణులు అమెరికా సాంకేతిక, వృత్తిపరమైన అవసరాలను తీర్చడానికి సహాయపడతారని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా H-1B వీసా వ్యవస్థ అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

భారతీయులపై ప్రభావం

ట్రంప్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు రెట్టింపు చేసిన వీసా ఫీజులు మునుపటిలాగా లేదా మరింత తగ్గవచ్చనే ఆశను రేకెత్తిస్తోంది. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కొత్తగా జారీ చేయబడే H-1B వీసాలలో 70% వీసాలు భారతీయ పౌరులకే లభిస్తున్నాయి. మిగిలిన వాటిలో 11-12% చైనా పౌరులకు దక్కుతున్నాయి.

Also Read: Eden Pitch: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై గిల్, గంభీర్ అసంతృప్తి?!

నైపుణ్యం కొరతపై ట్రంప్ స్పందన

H-1B వీసా సంస్కరణలు తన పరిపాలన ప్రధాన ప్రాధాన్యతగా ఉంటాయా అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా, “నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ఈ ప్రతిభను కూడా తీసుకురావాలి” అని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున శిక్షణ ఇవ్వకుండానే నిరుద్యోగులైన అమెరికన్లను తయారీ, రక్షణ రంగాలలో క్లిష్టమైన పాత్రల కోసం నియమించలేమని స్పష్టం చేశారు. “అమెరికాలో అంత ప్రతిభావంతులు లేరు. కొన్ని నైపుణ్యాలు మీకు లేకపోవచ్చు. వాటిని ప్రజలు నేర్చుకోవలసి ఉంటుంది. మీరు నిరుద్యోగ క్యూలో ఉన్న వారిని తీసి ‘మిస్సైళ్లు తయారుచేసే ఫ్యాక్టరీలో నేను మిమ్మల్ని పెడతాను’ అని చెప్పలేరు” అని ట్రంప్ ఉదహరించారు.

జార్జియా ఉదాహరణ

జార్జియా రాష్ట్రం ఉదాహరణను ప్రస్తావిస్తూ దక్షిణ కొరియా కార్మికులను తొలగించడం వల్ల సంక్లిష్టమైన ఉత్పత్తుల తయారీలో చాలా సమస్య వచ్చిందని ట్రంప్ వివరించారు. “వారి వద్ద జీవితాంతం బ్యాటరీలను తయారుచేసిన దక్షిణ కొరియా ప్రజలు ఉన్నారు. బ్యాటరీలు తయారు చేయడం చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన పని” అని ట్రంప్ పేర్కొన్నారు.

గత సెప్టెంబరులో ట్రంప్ H-1B వీసాలో పెద్ద మార్పులు చేశారు. అందులో కొత్త దరఖాస్తు ఫీజును $1,500 నుండి $100,000 (సుమారు 88 లక్షల రూపాయలు) కు పెంచారు. తాజా ప్రకటనలు ట్రంప్ పాలనలో H-1B వీసా విధానంలో సానుకూల మార్పులకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version