Trump – Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ ఛానల్‌లో కమలా హ్యారిస్‌తో జరిగే లైవ్ డిబేట్‌లో పాల్గొనేది లేదని ఇటీవలే ప్రకటించిన ట్రంప్(Trump – Kamala).. ఇప్పుడు మాట మార్చారు. తప్పకుండా ఆ డిబేట్‌లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. తనకు, కమలా హ్యారిస్‌కు మధ్య డిబేట్ జరుగుతుందని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు.‘‘కామ్రేడ్ కమలా హ్యారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ చర్చా కార్యక్రమం ఏబీసీ ఫేక్‌న్యూస్‌లో ప్రసారమవుతుంది. అదో అసహ్యకరమైన, అన్యాయమైన వార్తా సంస్థ’’ అని ఆ పోస్టులో ట్రంప్ విమర్శించడం గమనార్హం. సెప్టెంబర్ 10న ఫిలడెల్పియా వేదికగా ఈ లైవ్ డిబేట్ జరుగుతుందని తెలిపారు. ఆ డిబేట్‌లో పాల్గొనేందుకు నిర్దిష్ట షరతులు, నియమాలను ఉన్నాయని వెల్లడించారు.దీంతో ఆ రోజున జరిగే డిబేట్ కోసం యావత్ అమెరికన్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ డిబేట్‌లో కమలా హ్యారిస్ మహిళలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join
కమలా హ్యారిస్ పేరును ప్రకటించడానికి ముందు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ ఉన్నారు. జూన్ 27న జో బైడెన్‌తో సీఎన్‌ఎన్ న్యూస్ ఛానల్‌లో జరిగిన డిబేట్‌లో కూడా ట్రంప్ పాల్గొన్నారు. ఆ డిబేట్‌లో ట్రంప్‌తో ధీటుగా వాదించడంలో బైడెన్ విఫలమయ్యారు. ఆ కారణం వల్లే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాలని బైడెన్‌ను ప్రజలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. వయసు మీద పడిందంటూ చాలామంది బైడెన్‌ను ఎద్దేవా చేశారు. దీంతో చేసేది లేక తాను ఇక పోటీలో ఉండనని ప్రకటించారు. తనకు బదులుగా ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు.