Death Toll 2500 : ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం చోటుచేసుకున్న భూకంప మరణాల సంఖ్య 2500 దాటింది. దాదాపు 10వేల మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. భూకంపంతో చిగురుటాకులా వణికిపోయిన హెరాత్ ప్రావిన్స్ లోని జిందా జన్ జిల్లాలోని 13 గ్రామాలలో వేలాది ఇళ్లు కూలిపోయాయి. మరో వందలాది ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు వివరాలతో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మీడియా సంస్థల్లో కథనాలు పబ్లిష్ అయ్యాయి. ఈవివరాలను తాలిబాన్ విపత్తు నిర్వహణ శాఖ ప్రతినిధి జనన్ సైక్ కూడా ధ్రువీకరించారు.
We’re now on WhatsApp. Click to Join
జిందా జన్ జిల్లాలో ఏడుసార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ జిల్లాలో సంభవించిన ఐదు ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీక్ గా ఉన్న ఇళ్లన్నీ పేకమేడల్లా కూలిపోయాయని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. జిందా జన్ జిల్లాలో 7.7 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఈ భూకంపం ప్రభావంతో ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్ లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ (Death Toll 2500) స్తంభించాయి. ఈనేపథ్యంలో చైనా సర్కారు తక్షణ ఆర్థికసాయంగా హెరాత్ ప్రావిన్స్ కోసం దాదాపు రూ.1.66 కోట్లను అందించింది.