తైవాన్‌లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!

తైవాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తైతుంగ్ తీరంలో సంభవించిన 6.1 తీవ్రత భూకంపం తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Earthquake

Earthquake

Earthquake: తైవాన్ దేశం శనివారం రాత్రి మరోసారి భూకంప ధాటికి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా రాజధాని తైపీలోని భారీ భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దీనికి సంబంధించి తైవాన్ వాతావరణ సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

ఎక్కడ సంభవించింది?

సెంట్రల్ వెదర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి తైవాన్ ఈశాన్య తీర నగరమైన యిలాన్ లో భూకంపం సంభవించింది. యిలాన్ కౌంటీ హాల్‌కు తూర్పున 32.3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

Also Read: 35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!

ఫైర్ ఏజెన్సీ సూచనలు

తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ తక్షణమే రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేస్తోంది. ఈ భూకంపం తర్వాత సునామీ వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. రాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో ఫైర్ ఏజెన్సీ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది:

  • మొదట తమను తాము సురక్షితంగా కాపాడుకోవాలి.
  • ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉండాలి.
  • పడకల వద్ద బూట్లు, టార్చ్ లైట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • భూప్రకంపనలు పూర్తిగా ఆగిన తర్వాతే బయటకు రావాలని సూచించింది.

ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం

ప్రస్తుతానికి అందిన నివేదికల ప్రకారం.. తైపీ నగరంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ సమాచారం లేదు. అయితే స్థానిక మీడియా కథనాల ప్రకారం రాజధాని నగరంలోని భవనాలు తీవ్రంగా కదిలాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి.

వరుస భూకంపాలు

తైవాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తైతుంగ్ తీరంలో సంభవించిన 6.1 తీవ్రత భూకంపం తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది. దీని లోతు 11.9 కిలోమీటర్లుగా నమోదైంది. కావుషింగ్ వంటి పలు నగరాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సూపర్ మార్కెట్లలోని అరలు కూలిపోయినట్లు సమాచారం అందుతోంది. 2024 ఏప్రిల్ నెలలో తైవాన్‌లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం గత 25 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది. ఆ ప్రమాదంలో కొండచరియలు విరిగిపడి సుమారు 17 మంది మరణించిన విషయం తెలిసిందే.

  Last Updated: 27 Dec 2025, 10:40 PM IST