Stage Collapse : కుప్పకూలిన స్టేజీ.. 9 మంది మృతి.. 54 మందికి గాయాలు

మెక్సికోలో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. 

  • Written By:
  • Updated On - May 23, 2024 / 03:59 PM IST

Stage Collapse :  మెక్సికోలో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది.  ఈక్రమంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. సిటిజన్స్ మూవ్‌మెంట్ పార్టీ ఆధ్వర్యంలో శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన స్టేజీ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 54 మందికి గాయాలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

భారీగా ఈదురు గాలులు వీయడంతో స్టేజీ(Stage Collapse) కూలిపోయింది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన లైట్లన్నీ కింద ఉన్న వారిపై పడిపోయాయి. దీంతో భయబ్రాంతులకు గురైన జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉరుకులు పరుగులు పెట్టారు. ఈక్రమంలో జరిగిన తొక్కిలాటలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 54 మందికి గాయాలైంది కూడా ఈ ఘటనలోనే. దీంతో అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలను చేపట్టి గాయాలపాలైన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు.  ఈ సభా వేదికపై ఉన్న సిటిజెన్స్ మూవ్ మెంట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్ సురక్షితంగా బయటపడటంతో సభ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.  ఈ  ఘటనతో అల్వారెజ్   అన్ని ప్రచార కార్యకలాపాలను ఆపేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్రంలోనే ఉంటానని ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను న్యూవో లియోన్ గవర్నర్ శామ్యూల్ గార్సియా ధ్రువీకరించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణం పరిధిలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున  ప్రజలు బయటకు రావొద్దని ఆయన కోరారు.

Also Read : TGS RTC LOGO : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఫేకా ? నిజమైందేనా ? సజ్జనార్ క్లారిటీ