Site icon HashtagU Telugu

Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు

Pagers Explosions In Lebanon Israel Vs Lebanon War

Israel Vs Lebanon : లెబనాన్, సిరియా దేశాలలో అకస్మాత్తుగా కలకలం రేగింది. ఒక్కసారిగా వందల  పేజర్లు పేలిన ఘటనలో 9 మంది చనిపోగా, 2,750 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్‌ రాయబారితో పాటు ఇద్దరు హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ కీలక నేతలు, ఒక ఎంపీ కుమారుడు ఉన్నారు. లెబనాన్‌లోని బెకా లోయలో పేజర్ పేలిన ఘటనలో ఒక హిజ్బుల్లా కీలక నేతకు చెందిన పదేళ్ల కుమార్తె(Israel Vs Lebanon) చనిపోయింది. దీంతో వారిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇరాన్‌ రాయబారి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న పేజర్‌ పేలిందని గుర్తించారు. పేలడానికి ముందు ఆ పేజర్లు మితిమీరిన స్థాయిలో వేడెక్కాయని సమాచారం. అయితే ఈ ఘటనలో హిజ్బుల్లా చీఫ్‌ నస్రుల్లాకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఆయన క్షేమంగా ఉన్నట్లు హిజ్బుల్లా అనౌన్స్ చేసింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెలే ఉందని ఆరోపించింది. ఇజ్రాయెల్‌కు తగిన శాస్తి చేయక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేస్తామని లెబనాన్‌ ప్రభుత్వం తెలిపింది. కాగా, సిరియాలోని డమస్కస్‌లో ఒకచోట పేజర్ పేలిన ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి.

Also Read :Palm Rubbing Benefits: ఉద‌యం నిద్రలేవ‌గానే రెండు చేతులు రుద్దుకుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

ఆ పేజర్లలోకి పేలుడు పదార్థాలు..

లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ సొంత కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్ గూఢచారులు  ఈ టెలికం నెట్‌వర్క్‌లోకి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు. గత ఏడాది గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఫోన్ల వాడకాన్ని చాలావరకు తగ్గించేశారు. వాటి స్థానంలో కొత్త తరం ఆధునిక పేజర్లను వాడుతున్నారు. అయితే వాటిని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. అవన్నీ ఇరాన్ నుంచి లెబనాన్ కొనుగోలు చేసింది. ఆ పేజర్లలోకి పేలుడు పదార్థాలను ముందే చొప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇందుకోసం ఇరాన్‌లోని సదరు కంపెనీతో ఇజ్రాయెల్ గూఢచారులు కుమ్మక్కై ఉంటారని అంటున్నారు. ప్రతి పేజర్‌లో 1 నుంచి 3 గ్రాముల పేలుడు పదార్థాన్ని చొప్పించి ఉంటారని తెలుస్తోంది. ‘‘సైబర్‌ ఎటాక్ ద్వారా ఆ పేజర్లలోకి హ్యాకర్లు చొరబడి ఒక తప్పుడు అప్‌డేట్‌ను పంపి దాని బ్యాటరీ వేడెక్కేలా చేసి ఉంటారు.  అనంతరం రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఆ పేజర్లను పేల్చి ఉంటారు’’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read :Teja : తేజ కొత్త సినిమాకు టైటిల్ అదేనా..?

పేజర్ల వినియోగం ఇలా.. 

సెల్‌ఫోన్లు రాక ముందు పేజర్లు బాగా వాడేవారు. ఇది సెల్‌ఫోన్‌ అంత సైజులో ఉంటుంది. ఇందులో ముందుగా మనం ఎవరికి సమాచారం అందించాలో తెలియజేస్తూ పేజర్ల సెంటర్‌కు కాల్‌ చేసి చెప్పాలి. ఆ సెంటర్‌లో ఉండే ప్రతినిధి సంబంధిత వ్యక్తి వద్ద ఉండే పేజర్‌కు మెసేజ్‌ను  పంపుతాడు. దాన్ని చూసుకున్న వ్యక్తి అవసరమైన వారికి పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి కాల్‌ చేసి మాట్లాడుకుంటారు.