Worlds Toughest Prison: అల్కాట్రాజ్ జైలు.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైంది. దీన్ని 1963లో అమెరికా ప్రభుత్వం మూసేసింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని అల్కాట్రాజ్ అనే ద్వీపంలో ఉండే ఈ జైలును మళ్లీ తెరుస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇంతకీ ఈ జైలు ఎందుకు కఠినమైంది ? దీనితో ముడిపడిన ఆసక్తికర వివరాలు ఏమిటి ? ట్రంప్ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :China + Pakistan: పాక్ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?
అల్కాట్రాజ్ జైలు గురించి..
- పసిఫిక్ మహాసముద్రంలోని అల్కాట్రాజ్(Worlds Toughest Prison) ద్వీపంలో ఉన్నందువల్ల ఈ జైలుకు అల్కాట్రాజ్ అనే పేరొచ్చింది. ఈ జైలు చుట్టూ సముద్రపు నీళ్లే ఉండేవి.
- ఈ జైలును 1934లో ప్రారంభించారు. 1963 వరకు ఇది కొనసాగింది.
- అల్ స్కార్‌ఫేస్ కాపోన్, బర్డ్ మన్ రాబర్ట్ స్ట్రౌడ్, మెషీన్ గన్ కెల్లీ లాంటి ఘరానా క్రిమినల్స్‌ను ఈ జైలులో అప్పట్లో బంధించి ఉంచారు.
- ఈ జైలులో మంచిగా ప్రవర్తించే ఖైదీలను లైబ్రరీలోకి అనుమతించేవారు. జైలు సంగీత వాయిద్య టీమ్‌లో చోటును కల్పించేవారు.
- అల్కాట్రాజ్ జైలులోని ఖైదీలతో బట్టలు ఉతికించేవారు. వంటపనులు చేయించేవారు. చెత్తను కాల్చే పనిని చేయించేవారు. నౌకలలోకి సరుకులను లోడింగ్, అన్ లోడింగ్ చేయించేవారు. రోజంతా పనిచేస్తే అప్పట్లో ఖైదీలకు రూ.1.50 శాలరీగా ఇచ్చేవారట.
- ఈ జైలులోని ఖైదీలకు అందరికీ ప్రత్యేక గదులు ఉండేవి. ఒక్కో గది 5 *9 అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ఈ గదిలోనే మంచం, టాయిలెట్, సింక్ ఉండేవి.
- ఈ జైలులోని ఖైదీలు అందరికీ వేడినీళ్లతో స్నానం చేసే వసతిని కల్పించేవారు. ఎందుకంటే ఈ జైలు చుట్టూ చల్లటి సముద్రపు నీళ్లే ఉండేవి. ఒకవేళ రోజూ చల్లటి నీళ్లతో స్నానానికి అలవడితే .. ఈత కొడుతూ ఖైదీలు జైలు నుంచి పారిపోతారని భావించేవారు.
- ఖైదీలను వ్యాయామం చేసేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఖైదీలు శారీరకంగా ఫిట్‌గా తయారైతే సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లిపోతారని జైలు అధికారులు భావించేవారు.
- ఈ జైలు నుంచి పారిపోవడం దాదాపు అసాధ్యం. ఒకసారి 36 మంది ఖైదీలు పారిపోయేందుకు యత్నించారు. అయితే వాళ్లందరినీ బంధించి, మళ్లీ జైలుకు తీసుకొచ్చారు.
Also Read :India Attack Plan : మానవరహిత విమానాలతో పీఓకేపై ఎటాక్.. తజకిస్తాన్ నుంచి వార్ ?
అల్కాట్రాజ్ జైలును మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు ?
‘‘దుర్మార్గమైన, హింసాత్మకమైన నేరాలు చేసే వారివల్ల అమెరికా ఇబ్బందులు పడుతోంది. వారు దేశానికి ఎటువంటి సేవలు అందించకపోగా బాధపెడుతున్నారు.గతంలో ప్రమాదకరమైన నేరగాళ్లను అత్యంత దూరంగా ఉండే జైళ్లలో ఉంచాం. ప్రజలకు ఎటువంటి హాని చేయలేనంత దూరంలో వారిని పెట్టాం. అటువంటి కఠిన శిక్షలను మళ్లీ తేవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్లీ అల్కాట్రాజ్ జైలును వినియోగించాలని ఆదేశించాను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.