అమెరికా (America)లోని వర్జీనియాలోని ఓ పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో టీచర్ పై చిన్నారి కాల్పులు (Boy Shoots Teacher) జరిపాడు. అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. వర్జీనియాలోని రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్ లో తాజాగా విస్తుపోయే ఘటన జరిగింది. అక్కడ చదువుతున్న ఆరేళ్ల కుర్రాడు తరగతి గదిలోనే టీచర్ పై గన్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడైన ఆరేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. వర్జీనియాలోని న్యూపోర్ట్ న్యూస్ ప్రాంతంలోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఆరేళ్ల బాలుడు టీచర్ పై తుపాకీతో కాల్చాడు. అనంతరం పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా కథనాల ప్రకారం.. కాల్పుల ఘటనతో పాఠశాలలో గందరగోళం ఏర్పడింది. పాఠశాలలోని తరగతి గదిలో 30 ఏళ్ల టీచర్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ కాల్పులు జరిపిన ఘటన కాదన్నారు. నిందితుడిని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఆరేళ్ల విద్యార్థిగా గుర్తించారు. విద్యార్థి అదుపులో ఉన్నాడు. ఈ ఘటన టీచర్ పై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణిస్తున్నారు.
Also Read: US Man Kills Family: అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులని కాల్చి చంపిన భర్త
ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగిందని అధికారి తెలిపారు. విద్యార్థి తుపాకీని కలిగి ఉండి టీచర్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇతర విద్యార్థుల ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సహాయం కోసం పోలీసు శాఖ కామన్వెల్త్ అటార్నీ, అనేక ఇతర ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్ సోమవారం మూసివేయబడుతుందని న్యూపోర్ట్ న్యూస్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జార్జ్ పార్కర్ తెలిపారు. మీడియాను ఉద్దేశించి పార్కర్ మాట్లాడుతూ.. ఈ సంఘటనతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పాడు.