US Elections 2024 : ఇవాళ అంతటా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. ఈక్రమంలో మన భారతీయులు అందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ప్రస్తుతం జరుగుతున్న పోల్స్‌లో దాదాపు తొమ్మిది మంది భారతీయులు కూడా పోటీ చేస్తున్నారు. వీరిలో ఐదుగురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులే. అంటే వారు మరోసారి ఎన్నికయ్యేందుకు ఈసారి బరిలోకి దిగారు. ఆయా భారత సంతతి అభ్యర్థులతో ముడిపడిన వివరాలివీ..
Also Read :BITS Hyderabad : బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల ఘనత.. పేస్‌మేకర్లలో ఇక ‘ఫ్యూయల్ సెల్’
భారతీయుల అరంగేట్రం ఇలా..
అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు దలీప్ సింగ్ సంధూ(US Elections 2024). ఈయన 1957లో కాలిఫోర్నియా 29వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి గెలిచారు. ఆయన మూడుసార్లు అదే స్థానం నుంచి విజయఢంకా మోగించారు. 2005లో లూసియానా నుంచి బాబీ జిందాల్ అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభకు గెలిచారు. ఆయన రెండుసార్లు లూసియానా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.
బరిలో భారత తేజాలు..
- డాక్టర్ ప్రశాంత్ రెడ్డి.. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. ఆయన కన్సాస్ 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
- రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. 2017లోనూ ఈ స్థానంలో ఆయన గెలిచారు.
- తమిళనాడుకు చెందిన 59 ఏళ్ల ప్రమీలా జయపాల్ వాషింగ్టన్‌లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. 2017 నుంచి ఈ స్థానంలో ఆమె గెలుస్తూ వస్తున్నారు.
- 38 ఏళ్ల సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వైట్ హౌస్‌లో సహాయకుడిగా వ్యవహరించారు.
- రో ఖన్నా.. కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి బరిలోకి దిగారు. ఆయన గత ఏడేళ్లుగా ఇక్కడ గెలుస్తున్నారు.
- శ్రీ తానేదార్.. మిషిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు.
- డాక్టర్ రాకేశ్ మోహన్.. న్యూజెర్సీలోని 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు.
- 59 ఏళ్ల డాక్టర్ అమిబెరా.. కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన డెమొక్రటిక్ పార్టీ నేత. కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అయితే.. అమిబెరాకు కీలక పదవి దక్కే ఛాన్స్ ఉంది.
- డాక్టర్ అమిష్ షా.. అరిజోనాలోని తొలి కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు.