Vande Mataram – Thread : సన్నటి దారంపై ఏదైనా రాయడం సాధ్యమవుతుందా ? ఒకవేళ సాధ్యమైనా.. దారంపై రాతలు రాయడం అంత ఈజీయా ? అంటే.. ‘కాదు’ అనే చెప్పాలి. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఢిల్లీకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ అతుల్ కశ్యప్. మన దేశం గర్వించే ‘వందేమాతర’ గీతాన్ని ఆయన 23 సెంటీమీటర్ల గాలిపటం దారంపై కేవలం 20 నిమిషాల్లోనే అవలీలగా రాశారు. దీంతో ఆయన పేరు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కింది. అయితే ఈ ఫీట్ అంత ఈజీగా సాధ్యం కాలేదని.. దీని వెనుక ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ ఉందని అతుల్ చెప్పారు. దారంపై వందేమాతర గీతాన్ని రాయడం గురించి(Vande Mataram – Thread) దాదాపు 6 నెలల పాటు ప్రాక్టీస్ చేశానని ఆయన తెలిపారు. తాను రాసేందుకు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని వివరించారు. అయినా పట్టుదలతో ప్రాక్టీస్ చేసి, 20 నిమిషాల్లోనే ఈ ఫీట్‌ను సాకారం చేసే స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. తోటి యువతలో స్ఫూర్తిని నింపేందుకే ఇలాంటి ఫీట్స్ చేస్తున్నానని అతుల్ వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో రకాల సూక్ష్మ కళారూపాలను ప్రజల ముందుకు తీసుకొస్తానని అతుల్ కశ్యప్ చెప్పారు. రానున్న రోజుల్లో బియ్యపు గింజపై గాయత్రీ మంత్రాన్ని రాసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచంలోనే అతి చిన్న 3 మిల్లీమీటర్ల పుస్తకంలో మొత్తం హనుమాన్ చాలీసాను రాయడానికి సైతం ప్రయత్నిస్తున్నానని వివరించారు. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చి 3 మిల్లీమీటర్ల నోట్ బుక్‌ను తెప్పించానని తెలిపారు. అతుల్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్. అయితే ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని గోవింద్‌పురి కల్కాజీలో నివసిస్తున్నారు. అతుల్ తొలిసారిగా 2004లో ఆవపిండిపై ‘‘ఐ లవ్ మై ఇండియా’’ అని రాయడం ద్వారా వెలుగులోకి వచ్చారు. అనంతరం గోధుమ గింజ పరిమాణంలో మట్టితో చేసిన దీపాలను వెలిగించారు. సూది రంధ్రంలోకి 100 కంటే ఎక్కువ దారాలను దూర్చారు.