Valentine’s Day : ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) అంటే ఒకప్పుడు ఎర్ర గులాబీలు, గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్లకే పరిమితం అయ్యేది. కానీ మారుతున్న కాలంతో పాటు ట్రెండ్స్ కూడా మారిపోయాయి. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే, ప్రేమలో ప్రాక్టికాలిటీ పెరిగిందని అర్థమవుతోంది.
ఒకప్పుడు ప్రేమికుల రోజు వచ్చిందంటే పూల మార్కెట్లు కిక్కిరిసిపోయేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ ట్రెండ్ మారింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే నాడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్స్‌లో పువ్వులు, గిఫ్ట్ ప్యాక్‌ల కంటే కండోమ్స్ మరియు ఇతర శృంగార అనుబంధ ఉత్పత్తులకే అత్యధికంగా ఆర్డర్లు వచ్చాయి. ప్రేమ అంటే కేవలం భావవ్యక్తీకరణ మాత్రమే కాకుండా, సురక్షితమైన కలయికకు కూడా యువత అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ రకమైన సేల్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
నగరాల వారీగా ఆర్డర్ల వెల్లువ
ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా చాక్లెట్లు మరియు టెడ్డీ బేర్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్డర్ల పరంగా బెంగళూరు నగరం అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మరియు చెన్నై నగరాలు నిలిచాయి. విచిత్రమేమిటంటే, కోల్‌కతాలో ఒక వ్యక్తి ఏకంగా రూ. 25,000 విలువైన చాక్లెట్లను ఒకేసారి ఆర్డర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గులాబీ పువ్వుల కంటే కండోమ్స్ ఎక్కువగా అమ్ముడవుతుండటం చూస్తుంటే, “ప్రేమంటే రోజా పువ్వు కాదు.. రక్షణతో కూడిన బంధం” అనే భావనకు నేటి తరం ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
సామాజిక మార్పుకు నిదర్శనం
ఈ ట్రెండ్‌ను కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా సామాజిక మార్పుగా కూడా చూడవచ్చు. గతంలో కండోమ్స్ లేదా శృంగార ఉత్పత్తులను షాపులకు వెళ్లి కొనడానికి ఇబ్బంది పడేవారు, ఇప్పుడు క్విక్ కామర్స్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో నికోచం లేకుండా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల సురక్షితమైన శృంగారం పట్ల అవగాహన పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వాలెంటైన్స్ డే కాస్త ‘కండోమ్స్ డే’గా మారిపోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ ఏడాది వాలెంటైన్స్ డే టాలీవుడ్ సెన్సేషనల్ డైలాగ్ “దుంపతెగ” అన్న రేంజ్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది.
