Site icon HashtagU Telugu

Uttar Pradesh: 5 కిలోల బంగాళాదుంపలు లంచంగా అడిగిన పోలీస్

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఓ పోలీస్ అధికారి 5 కిలోల బంగాళాదుంపలు లంచంగా ఇవ్వాలని కోరడం వైరల్ గా మారింది. పోలీసులు లంచాలు అడగడం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తారు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ పోలీస్ మాత్రం ఆశ్చర్యంగా 5 కిలోల బంగాళాదుంపలు లంచంగా అడిగాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే 5 కిలోల బంగాళాదుంపలు మాటకి మరో అర్ధం ఉందట.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ “బంగాళదుంపలు” లంచంగా డిమాండ్ చేసినందుకు సస్పెండ్ కు గురయ్యాడు. “బంగాళదుంప” అనే పదాన్ని లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. రామ్ కృపాల్ సింగ్ అనే పోలీసు కేసును పరిష్కరించేందుకు లంచం అడిగాడని ఆరోపించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడిని సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు . ఈ కేసుపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టాలని సూచించారు.

నిందితుడైన పోలీసు ఒక రైతును 5 కిలోల “బంగాళాదుంపలు” అడిగాడు. అయితే ఆ మొత్తం ఇవ్వలేకపోయాడు ఆ రైతు. బదులుగా 2 కిలోలు ఇచ్చాడు. దాంతో పోలీసు అధికారి కోపంతో నేను అడిగింది ఏంటి?, నువ్వు ఎంత ఇస్తున్నావు అంటూ ఆ రైతుపై దౌర్జన్యం చేశాడు. చివరికి 3 కిలోల చొప్పున తుది ఒప్పందం కుదిరింది. అయితే ఇక్కడ బంగాళాదుంపలకు బదులుగా డబ్బు డిమాండ్ చేసినట్లు చెప్తున్నారు. ఈ విషయాన్నీ కన్నౌజ్ పోలీసులు X లో పంచుకున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిటీ సర్కిల్ అధికారి కమలేష్ కుమార్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

Also Read: Vinod Kambli Health: వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్రెండ్స్ కీలక అప్డేట్