Girls Beware : ప్రస్తుత స్మార్ట్ యుగంలో సాంకేతికత ఎంతలా పెరుగుతుందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా సరికొత్త రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లను వేదికగా చేసుకుని అమాయకులను, మహిళలను బురిడీ కొట్టించే ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా త్రెడ్స్ (Threads) యాప్ వేదికగా జరుగుతున్న ఒక వింతైన మోసం వెలుగులోకి వచ్చింది. మహిళలతో చాటింగ్ చేసే వ్యక్తులను టార్గెట్ చేసి, పోలీసులమంటూ బెదిరిస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న ఇద్దరు కేటుగాళ్లను కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్, సందీప్ కుమార్ అనే వ్యక్తులు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు డి.ఎస్.పి ప్రమోద్ వెల్లడించారు.
ఈ నేరగాళ్ల పనితీరు అత్యంత పకడ్బందీగా సాగుతుంది. త్రెడ్స్ యాప్‌లో మహిళల ఫోటోల కింద అసభ్యకర మెసేజ్‌లు పెట్టే వారిని లేదా వారితో చాటింగ్ చేసే వారిని వీరు ముందుగా గుర్తిస్తారు. కోవెలకుంట్లకు చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తి ఇలాగే వీరి ఉచ్చులో చిక్కాడు. నిందితుడు చంద్రశేఖర్ తనకు తాను గద్వాల ఎస్సైగా పరిచయం చేసుకుని ప్రతాపరెడ్డికి ఫోన్ చేశాడు. “నువ్వు చాటింగ్ చేసిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది, కేసు నమోదు కాకుండా ఉండాలంటే ఆమె భర్తతో సెటిల్మెంట్ చేసుకోవాలి” అంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ మహిళా ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉందని, చికిత్స కోసం రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోలీసుల వేధింపులకు భయపడిపోయిన బాధితుడు ప్రాథమికంగా రూ. 30 వేలు ఫోన్ పే (PhonePe) చేశాడు. అయితే నేరగాళ్ల ఆశ అంతటితో తీరలేదు; మరింత డబ్బు కావాలంటూ టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫోన్ పే ట్రాన్సాక్షన్ల ఆధారంగా కేవలం ఐదు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా అసభ్యకర సందేశాలు పంపేటప్పుడు ఇటువంటి ముఠాల బారిన పడే ప్రమాదం ఉందని, కాబట్టి నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
