Site icon HashtagU Telugu

King Cobra : 18 అడుగుల పొడువైన‌ కింగ్ కోబ్రాను ప‌ట్టుకున్నమహిళా అధికారి..ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్

Female officer catches 18-foot-long king cobra, netizens salute her courage

Female officer catches 18-foot-long king cobra, netizens salute her courage

King Cobra: పాము అనే పేరు వింటేనే మనం భయంతో వణికిపోతాం. పక్కనే ఓ చిన్న పాము కదిలితేనే పాదాల పని మరిచిపోయి పరుగులు తీస్తాం. అలాంటప్పుడు కింగ్ కోబ్రా లాంటి అత్యంత ప్రమాదకర పాము ఎదురైతే… సాధారణంగా ఎవ్వరూ ధైర్యం చేయలేరు. కానీ కేరళలోని ఓ మహిళా ఫారెస్ట్ అధికారి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆమె 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎలాంటి బెదురు లేకుండా పట్టేసి ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పెప్పర ప్రాంతంలోని నివాస కాలనీల మధ్యగా ఉన్న ఓ కాలువలో విపరీతంగా పెద్దదైన కింగ్ కోబ్రా సంచరించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. అందరూ ఆ పామును చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్ట్ రేంజ్‌కి చెందిన మహిళా అధికారి రోషిణి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణంగా ఇలా ఎదురుగా కింగ్ కోబ్రా కనిపిస్తే ఎవరైనా వెనక్కి తగ్గిపోతారు. కానీ రోషిణి మాత్రం పూర్తి నిశ్చలంగా, స్నేక్ స్టిక్‌తో చేతిలోకి పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కోబ్రా బుసలు కొడుతూ, ఆమె వైపు దూసుకొచ్చింది. కానీ ఆమె భయపడలేదు. ధైర్యంగా నిలబడి ఆ కోబ్రా నీటిలోకి వెళ్తుండగా తోక పట్టుకుని అదుపులోకి తెచ్చారు. పాము సుమారు 18 అడుగుల పొడవులో ఉండటంతో అది పూర్తిగా చెక్ చేయడానికి రోషిణికి కొంత సమయం పట్టింది. చివరకు పాము పూర్తిగా శాంతించాక, దాన్ని జాగ్రత్తగా సంచిలో బంధించారు. ఈ మొత్తం ప్రక్రియను అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ అయింది.

వీడియోలో రోషిణి చూపించిన ధైర్యాన్ని చూసి నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “హ్యాట్సాఫ్ రోషిణి మేడమ్”, “అద్భుతమైన ధైర్యం”, “రియల్ లైఫ్ స్నేక్ వుమన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమెను మహిళా ‘బాహుబలి’ అంటూ పొగడ్తలు పలికారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం రోషిణి ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఇంకొన్ని పెద్ద పెద్ద పాములను సురక్షితంగా పట్టి వన్యప్రాణుల సంరక్షణలో కీలకపాత్ర పోషించారు. ఆమెకు పాములపై ఉన్న అవగాహన, తన శిక్షణ, నిబద్ధత ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన మనకు చెబుతోంది. ధైర్యం ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవచ్చు. మహిళలు కూడా పురుషులకంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు అనే సందేశాన్ని రోషిణి తన పనితో స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ 18 అడుగుల కింగ్ కోబ్రా సరైన ప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించి అక్కడ విడిచిపెట్టనున్నారు. అంతా చూసిన తర్వాత ఒకే మాట చెప్తున్నారు. రోషిణి నువ్వు నిజంగా అద్భుతమైన అధికారి.

Read Also:  EC : తెలంగాణ లో ఈసీ రద్దు చేసిన 13 పార్టీలు ఇవే !