Fact Checked By factly
కుర్‌కురేలను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా భారీ సేల్స్ జరిగే తినుబండారాల్లో ఇది ఒకటి. కుర్‌కురే ఫ్లేవర్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అందుకే పిల్లలు నోరెత్తితే చాలు.. కుర్‌కురే కావాలి అని అడిగేస్తుంటారు. అయితే ఇటీవలే కుర్‌కురేల(Fact Check) పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. కుర్‌కురేలను పొడి చేసి, ఆ పొడికి నిప్పు పెడితే.. అది ఆగకుండా మండుతున్నట్లుగా వీడియోలో చూపించారు. దీనిపై ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కుర్‌కురే తినడం ప్రమాదకరమని ఆ వీడియో పోస్టులో రాశారు. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయమని ‘ఫ్యాక్ట్‌లీ’ వెబ్‌సైట్ వాట్సాప్ నంబర్ (+91 92470 52470)కు అభ్యర్థనలు వెళ్లాయి. దీంతో ఫ్యాక్ట్ చెక్ చేయగా.. నిజానిజాలు వెలుగుచూశాయి.
Also Read :Kiara Advani : జానీ మాస్టర్‌ను పొగిడిన కియారా.. నిప్పులు చెరిగిన నెటిజన్లు
ప్రచారం : కుర్‌కురే పొడికి మండే స్వభావం ఉందని చెబుతూ ఒక వీడియోను చూపించారు.
నిజం : ఒక మండుతున్న పదార్థాన్ని వీడియోలో చూపించారు. అది కుర్‌కురే పొడి కాదు. వాస్తవానికి అది అమోనియం డైక్రోమేట్. దీని ఫార్ములా (NH4)2Cr2O7). కాబట్టి ఈ పోస్ట్ తప్పు.
వైరల్ వీడియోను తనిఖీ చేయగా అందులో ‘@sarveshtripathimaxscience’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. దీని ఆధారంగా ఈ వీడియో (ఆర్కైవ్)ను తొలుత “Sarvesh Tripathi Max science” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో 2024 డిసెంబరు 20న అప్‌లోడ్ చేశారని మేం గుర్తించాం. వారి వెబ్‌సైటులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. అది గుజరాత్‌లోని ఒక విజ్ఞాన కేంద్రం. వివిధ సైన్స్ ప్రయోగాలు చేయడాన్ని అక్కడ విద్యార్థులకు నేర్పిస్తుంటారు.
Also Read :Delhi Polls : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడికి మజ్లిస్ టికెట్ ? ఈ మీటింగ్ అందుకేనా ?
ఇక, ఈ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇలాంటి సైన్స్ ప్రయోగాన్నే చూపించే మరిన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు యూట్యూబ్‌లో కనిపించాయి. అయితే, ఆ వీడియోల్లో ఉపయోగించిన ఈ నారింజ రంగు పదార్థం పేరు అమోనియం డైక్రోమేట్ ((NH4)2Cr2O7) అని పేర్కొన్నారు. ఈ పదార్థానికి మండే స్వభావం ఉంటుం ది. అనేక ప్రయోగశాలల్లో ఈ ప్రయోగాన్ని చేస్తుంటారు. అయితే అమోనియం డైక్రోమేట్‌కు ఉన్న హానికారక స్వభావం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో గురించి ‘Sarvesh Tripathi Max science’ వారిని మేం సంప్రదించగా.. ఈ ప్రయోగంలో తాము వాడిన పదార్థం అమోనియం డైక్రోమేట్ అని తెలిపారు. ఈ ప్రయోగం కోసం కుర్‌కురేను వాడినట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
చివరిగా.. ఆరోగ్యంపై కుర్‌కురే ప్రభావాన్ని మేం ధృవీకరించనప్పటికీ, వైరల్ వీడియోలో మండుతున్న పదార్థం కుర్‌కురే కాదని తేలింది. అది అమోనియం డైక్రోమేట్ అని నిర్ధారణ అయింది.