కర్నూల్ జిల్లా(Kurnool District)లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందర్నీ షాక్ కు గురిచేస్తుంది. తమకంటే బాగా చదువుతుందని చెప్పి ఓ విద్యార్థిని పై క్షుద్రపూజలు (Black Magic) చేసిన ఘటన ఎస్.ఆర్ జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది.ఎక్కడైనా పోటీ పడి చదివి మంచి మార్కులు సాధించే తత్వం ఉండాలి కానీ, ఏకంగా ఆ విద్యార్థినిపై చేతబడి చేయడం ఏంటి అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
ఎస్.ఆర్ జూనియర్ కళాశాల(SR Junior College)లో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బ్లెస్సీ(Blessy) అనే విద్యార్థిని నిద్రిస్తున్న గదిలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి ఆమె జుట్టు కత్తిరించడమే కాకుండా, కత్తితో చెయ్యి కోశాడు. ఆ వెంటనే నిద్ర లేచిన బ్లెస్సీ కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడి తర్వాత గదిలో నిమ్మకాయలు, జుట్టు, మరియు “కిల్ యు” అని రాసిన లేఖ కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి తెలియజేశారు. కానీ యాజమాన్యం ఈ ఘటనను గోప్యంగా ఉంచారు. కనీసం బ్లెస్సీ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు. తోటి విద్యార్థుల ద్వారా ఆ తల్లిదండ్రులు విషయం తెలుసుకుని కళాశాలకు చేరుకుని ప్రశ్నించగా, యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వలేదు.
Emergency Ticket System : ‘ఐఆర్‌సీటీసీ’లో ఎమర్జెన్సీ టికెట్ సిస్టమ్‌పై వివాదం.. ఏజెంట్ల దందా
బ్లెస్సీ తల్లిదండ్రులు తమ కూతురికి వచ్చే మంచి మార్కులపై కొందరికి అసూయ పెరగడం వల్లే ఈ ఘటన జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. వారే ఇలా క్షుద్ర పూజల యత్నం చేసి ఉంటారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడ యాజమాన్యాన్ని నిలదీశాయి. విద్యార్థి సంఘాలు ఈ ఘటనకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాలేజీ ఆవరణలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మహిళా సంఘాలు కూడా విద్యార్థి సంఘాలకు మద్దతుగా నిలబడ్డాయి. దుండగులను తక్షణమే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.