బెంగళూరు నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణమైన మోసానికి గురయ్యాడు. వివాహం తర్వాత లైంగిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ టెకీ, నకిలీ ఆయుర్వేద వైద్యుడిని నమ్మి ఏకంగా ₹48 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతేకాక అనవసరమైన చికిత్స వల్ల కిడ్నీ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాడు. 2023లో వివాహమైన తర్వాత ఈ సమస్య తలెత్తగా, మొదట అతను కెంగేరి సమీపంలోని ఒక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మే 3న, KLE లా కాలేజీ దగ్గర రోడ్డు పక్కన కనిపించిన ‘ఆయుర్వేదిక్ దావఖానా’ టెంట్‌ను చూసి మోసపోయారు. అక్కడ ‘విజయ్ గురూజీ’గా పరిచయం చేసుకున్న వ్యక్తిని సంప్రదించడంతో ఈ మోసం మొదలైంది.
Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!
‘విజయ్ గురూజీ’ తాను చెప్పిన ‘అరుదైన ఆయుర్వేద మందులు’ వాడితే శాశ్వతంగా నయం అవుతుందని టెకీని నమ్మించాడు. అందులో ముఖ్యంగా ‘దేవరాజ్ బూటీ’ అనే ఉత్పత్తిని యశ్వంత్‌పూర్ ప్రాంతంలోని విజయలక్ష్మి ఆయుర్వేదిక్ స్టోర్ నుండి కొనుగోలు చేయమని సూచించాడు. ఈ ‘బూటీ’ని హరిద్వార్ నుండి ప్రత్యేకంగా తెప్పించారని, దీని ధర గ్రాముకు ఏకంగా రూ. 1.6 లక్షలు అని చెప్పాడు. అంతేకాకుండా, ఈ మందు కొనేటప్పుడు ఎవరినీ వెంట తెచ్చుకోవద్దని, కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని నకిలీ వైద్యుడు షరతులు పెట్టాడు. గురూజీ చెప్పిన మాటలు పూర్తిగా నమ్మిన టెకీ, మొదట ఆ మందును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత గురూజీ ‘భావన బూటీ తైలం’ అనే మరో మూలిక మిశ్రమాన్ని గ్రాముకు ₹76,000 చొప్పున కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశాడు.
నకిలీ వైద్యుడి మాటలు నమ్మి ఆ టెకీ మొదట తన భార్య, తల్లిదండ్రుల నుండి రూ. 17 లక్షలు అప్పుగా తీసుకొని ఈ మందులు కొన్నాడు. ఆ తర్వాత చికిత్స విఫలమవుతుందని బెదిరించి మరిన్ని ‘దేవరాజ్ బూటీ’ని కొనమని గురూజీ బలవంతం చేశాడు. దీంతో బాధితుడు రూ. 20 లక్షల బ్యాంక్ లోన్ తీసుకుని ఆ మందులు కొనుగోలు చేశాడు. ఇలా మొత్తం మీద అతను ఏకంగా రూ. 48 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మోసంపై ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యావంతులైన వారు సైతం ఇలాంటి నకిలీ వైద్యుల చేతిలో మోసపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
