Site icon HashtagU Telugu

Six Pack Old Man : యువ‌త‌కు ఆద‌ర్శం .. సిక్స్‌ప్యాక్ తాత‌య్య‌..

75 Years Old Man Maintaining Six Pack news goes Viral

Six Pack Old Man

Six Pack Old Man : ఆరోగ్యమే మ‌హాభాగ్యం. ఆరోగ్యంగా(Health) ఉంటే మ‌నం చేసే ప‌నిలోనూ ఉత్సాహంగా ఉంటాం. త‌ద్వారా మ‌నం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు వేగంగా అడుగులు వేస్తాం. ఇందుకు వ‌య‌స్సుతో ప‌నిలేదు. అయితే.. నేటి యువ‌త ఆరోగ్యం విష‌యంలో స‌రియైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌టం.. నాణ్య‌మైన ఆహారం తీసుకోక‌పోవ‌టంతో 40 నుంచి 50ఏళ్లు వ‌చ్చే స‌రికే నీర‌సించి పోతున్నారు. ప‌లు దీర్ఘ‌కాలిక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. కానీ, 75ఏళ్ల వ‌య‌స్సులోనూ సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తూ ఓ తాత అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. ఆరోగ్యంగా ఉండాలంటే వ‌య‌స్సుతో సంబంధం లేదు.. సిక్స‌ప్యాక్ మెయింట‌న్ చేయాలంటే య‌వ‌కులే అయ్యండాల్సిన ప‌నిలేదంటూ నిరూపిస్తున్నాడు. ఒక‌టి రెండేళ్లు కాదు.. ఏకంగా త‌న 28వ ఏట నుంచి సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తూ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తున్నాడు. ఇంత‌కీ ఆ వృద్ధ కండ‌ల వీరుడు ఎవ‌రు..? వృద్యాప్యంలోనూ అత‌ని ఆరోగ్యానికి ర‌హ‌స్యం ఏమిటి అనే విష‌యాలు తెలుసుకుందాం.

సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌ప‌ల్లికి చెందిన ఎం. విజ‌య్ కుమార్ వృద్ధాప్యంలోనూ సిక్స్‌ప్యాక్‌ బాడీ మెయింటెన్ చేస్తూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. నాలుగు ద‌శాబ్దాలుగా క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని ద‌రిచేర‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిర‌ప‌డిన విజ‌య్ కుమార్ 28ఏళ్ల వ‌య‌స్సు నుంచి వ్యాయామం మొద‌లు పెట్టాడు సికింద్రాబాద్ ప్రాంతంలో విజ‌య్ కుమార్ వ‌ర్క‌వుట్ చేయ‌ని జిమ్‌, సైక్లింగ్ చేయ‌ని రోడ్డు, జాగింగ్ చేయ‌ని మైదానం లేదంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. విజ‌య్ కుమార్ 75ఏళ్ల వ‌య‌స్సులోనూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం.. అశ్ర‌ద్ద వ‌హించ‌కుండా ప్ర‌తీరోజూ వ్యాయామం చేయ‌డం. తాను తీసుకునే ఆహారంలో ఇంటి ఆహారంతోపాటు శాకాహారానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం. అంతేకాదు.. దుర‌ల‌వాట్ల‌కు దూరంగా ఉండ‌టం. ఇలా తాను పెట్టుకున్న నియామ‌కాల‌కు క‌ట్టుబ‌డి ఉంటూ వృద్ధాప్యంలోనూ విజ‌య్ కుమార్ సిక్స్ ప్యాక్ బాడీని కొన‌సాగిస్తున్నాడు.

విజ‌య్ కుమార్ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కూ వ్యాయామం, క్రీడ‌లు రోజువారి జీవ‌నంలో భాగ‌మ‌య్యాయి. విజ‌య్ కుమార్ భార్య శాద‌ర కూడా ఉద‌యాన్నే లేచి వాకింగ్‌, జాగింగ్ ల‌కు వెళ్తుంటారు. సీనియ‌ర్ సిటిజ‌న్స్ క్రీడ‌ల్లో పాల్గొని ప‌లు ప‌త‌కాల‌ను గెలుచుకున్నారు. విజ‌య్, శార‌ద దంప‌తుల‌కు ఒక కుమార్తె, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకున్నారు. కుమారులు ప‌వ‌న్, న‌వీన్ ఇద్ద‌రూ జాతీయ, అంత‌ర్జాతీయ స్విమ్మ‌ర్లు. పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిర‌ప‌డ‌గా.. చిన్న‌కుమారుడు స్విమ్మింగ్ కోచ్ గా ఉన్నాడు. విజ‌య్ కుమార్ కొన్నేళ్లుగా స్నేహ సీనియ‌ర్ సిటిజ‌న్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధిగా కొన‌సాగుతూ వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ వృద్ధుల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వ‌హించిన బాడీ బిల్డింగ్‌, సైక్లింగ్ పోటీల్లో నేటీకి పాల్గొంటున్నారు.

Also Read : Dark Chocolate : ఈ చాక్లెట్ పిల్లల తెలివితేటలకు, గుండె ఆరోగ్యానికి మంచిదట..!