Site icon HashtagU Telugu

Ram Mandir Photos : ముస్తాబైన అయోధ్య రామమందిరం.. ఫొటోలు, ప్రారంభోత్సవ విశేషాలివీ

Ram Lalla

Ram Lalla

Ram Mandir1

Ram Mandir Photos : అయోధ్యలో అంతా రామమయంగా మారింది. ఎటు చూసినా రామనామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తోంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య ముస్తాబైంది. భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో ద్వారాల అలంకరణ, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్యా నగరం బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.

ఈరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1గంటకు ముగియనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. దాదాపు 7వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు/ఆన్‌లైన్‌ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్‌ డీసీ మొదలుకొని పారిస్‌, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో విశ్వహిందూ పరిషత్‌, పలు హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం హాఫ్‌ డే సెలవు ప్రకటించగా.. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఫైనాన్షియల్‌ సంస్థలు, గ్రామీణ బ్యాంకులు మధ్యాహ్నం 2.30గంటల వరకు మూతబడనున్నాయి. అలాగే, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ సైతం హాలిడే ప్రకటించాయి. దేశంలోని పలు రాష్ట్రాలు సైతం జనవరి 22న సెలవు ప్రకటించాయి.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం ఉంటుంది.

రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులున్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారినీ ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలనూ ఆహ్వానించినా వారెవరూ హాజరుకావడం లేదు. గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకతీతంగానూ పలువురు వచ్చారు.

Also Read: G. Pulla Reddy : అయోధ్య పోరాటంలో పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పాత్ర ఎప్పటికీ మరచిపోలేము..

Exit mobile version